తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మె ఉదృతమయింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మికులకు మధ్య దూరం పెరిగింది. ఐదేళ్ల క్రితం జరిగిన సమ్మె సమయంలో.. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలేవీ అప్పట్లో తీసుకోలేదు. సమ్మె జరుగుతూండగా ప్రభుత్వం వారికి ఫిట్ మెంట్ ప్రకటించి కార్మికుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయం, కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరిన సమయం కావడంతో అప్పటి పరిస్థితులు వేరు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

 

 

 

పండుగ సీజన్ కావడంతో సీఎం కేసీఆర్ ఈ సమ్మెపై సీరియస్ అయ్యారు. కార్మికుల డిమాండ్లకు తలొగ్గలేక, ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో ప్రభుత్వం తలమునకలైంది. అసలే దసరా పండుగ సమయం.. ప్రజల ప్రధాన రవాణా సాధనం బస్.. ఈ పరిస్థితలు ప్రభుత్వానికి కాసింత సంకట స్థితే. అత్యంత వేగంగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్యాయ చర్యలే ఇందుకు ఉదాహరణ. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే గతంలో తమిళనాడు పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. గతంలో సీఎంగా ఉన్న జయలలిత.. ప్రభుత్వోద్యోగులు చేసిన సమ్మెపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులను తొలగించేందుకు కూడా వెనుకాడలేదు. ప్రైవేటు ఉద్యోగులను నియమించి పాలన ఆగకుండా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అడుగులు అటువైపే పడనున్నాయా అనే అనుమానం వస్తోంది. ఇదే జరిగితే సమ్మె మరింత తీవ్రం అవుతుంది. ఇందులో సందేహం లేదు. 

 

 

 

కార్మికులు ఈ సమ్మెను పండుగ సమయంలో కాకుండా సాధారణ సమయంలో చేసుంటే ప్రభుత్వ పరంగా నిర్ణయం మరోలా ఉండేదేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా సమ్మె విషయంలో ముందుకే అడుగు వేస్తున్నారు. మరి కేసీఆర్ జయలలిత విధానాల దిశగా ఆలోచిస్తారా.. లేక కార్మిక సంఘాల డిమాండ్లు నెరవేరుస్తారా వేచి చూడాల్సిందే. అయితే ఇవన్నీ పండుగ తర్వాతే కొలిక్కివచ్చేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: