టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను ఈరోజు బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రవిప్రకాష్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 9 నెలల కాలంలో 18.31 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని చీటింగ్ కేసు నమోదైంది. కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. టీవీ9 మాజీ సీఎఫ్ఓ మూర్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 
 
రవిప్రకాష్ మరియు మూర్తి సంస్థ డైరక్టర్ల అనుమతి లేకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలుస్తోంది. నిధుల దుర్వినియోగం వలన షేర్ హోల్డర్లకు భారీగా నష్టం వాటిల్లటంతో టీవీ9 కొత్త యాజమాన్యం రవిప్రకాష్ పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మెజారిటీ షేర్ హోల్డర్ అయిన అలంద మీడియా రికార్డులు వెరిఫికేషన్ చేసే సమయంలో ఈ కుంభకోణం బయటపడిందని తెలుస్తోంది. 
 
భారీ కుంభకోణం వెలుగులోకి రావటంతో అలంద మీడియా ఈ కుంభకోణాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలను తీసుకోవాలని పోలీసులను కోరింది. రవిప్రకాష్ పై గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే తనపై కేసులు ఉండటంతో సతమతమవుతున్న రవిప్రకాష్ కు మరో కొత్త కేసు నమోదు కావటం ఇబ్బంది కలిగించే విషయమే అని చెప్పవచ్చు. 
 
రవిప్రకాష్ పై గతంలో పోలీసులు టీవీ9 స్టూడియోకు వచ్చిన సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలంద మీడియా నిన్న 18 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవిప్రకాష్ దురుద్దేశపూర్వకంగా కూడా వ్యవహరించాడని చెప్పి టీవీ9 కొత్త యాజమాన్యం ఆరోపణలు కూడా చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు జారీ చేసిన నోటీసులను తీసుకోవటానికి రవిప్రకాష్ నిరాకరించటంతో పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. పోలీసుల విచారణ తరువాత ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: