ఏరు దాటే వరకు ఒకలా ఏరు దాటిన తరువాత మరొకలా ఉండటమే అంటే ఏంటో ప్రభుత్వాలకు బాగా తెలుసు.  ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించి.. నమ్మించి.. లాలించి ఓటు వేయించి.. అధికారపీఠం మీద కూర్చుంటారు.  అలా కూర్చున్న తరువాత హామీలను మర్చిపోయి.. కొత్తపథకాల పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటారు. పాతవి అడిగితె.. అవెందుకు దండగ కొత్తవి ఉండగా ఉండగా అని చెప్పి అరకొరగా అమలు చేస్తుంటారు.  


2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత బంగారు తెలంగాణ పేరుతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చింది.  హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అన్నది పక్కన పెడితే.. సకలజనుల సమ్మె సమయంలో ఆర్టీసీ అప్పట్లో ప్రముఖ పాత్రను పోషించింది.  ఆర్టీసీ కార్మికులు చేసిన కృషికి ముఖ్యమంత్రి కెసిఆర్ అనేకమార్లు కృతజ్ఞతలు తెలిపారు.  అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.  


2019 వరకు అంతా బాగుంది.  అయితే, 2018 కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.  ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత కూడా కొత్తకొత్తపథకాలు ప్రవేశపెట్టారు.  అమలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.  దేశంలో తొలి ఐదుమంది బెస్ట్ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.  అయితే, 2019 లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు.  ఇందులో ఒకటి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం.  హామీ ఇచ్చిన నాలుగు నెలల్లోనే లోటు బడ్జెట్ ఉన్నా సరే విలీనం చేశారు.  


దీన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం కోరింది.  కానీ, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.  ఈరోజు నుంచి సమ్మెకు దిగడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.  అంతేకాదు, విధుల్లోకి హాజరు కాకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.  అయినా ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేసింది.  ఒకవేళ కార్మికులు విధులకు హాజరు కాకపోతే విధుల నుంచి బహిష్కరిస్తారా.. నిజంగానే అలా చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉంటుందా..? వేలాది మంది ఉద్యోగులను విధుల నుంచి ఒకేసారి తొలగిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలుసు.  కేవలం బెదిరించడం కోసమే అలా చేసి ఉంటుంది.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: