ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలు ఆయన   ఓర్వలేని తనానికి నిదర్శనమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఛీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ చిత్తశుద్దితో పరిపాలన చేస్తుంటే ఓర్వలేక కుళ్లుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని రెండు నెలల ముందు ఓట్ల కోసం పధకాలు తెచ్చిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఎన్నికలలో చేసిన వాగ్దానాలను నాలుగు నెలల్లోనే అమలు చేస్తున్న ఘనత  వైయస్ జగన్ మోహన్ రెడ్డిదని స్పష్టం చేశారు.
తన నిర్వాహకం వల్ల జరిగిన కోడెల ఆత్మహత్యను సైతం రాజకీయం చేసే క్రమంలో విక్టరీ సింబల్ చూపిస్తూ దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని ఆరోపించారు. ఆటోడ్రైవర్లకు ఏ ప్రదేశంలో  పదివేలు ఇస్తానని వాగ్దానం చేశారో సీఎం జగన్ అదే ప్రదేశంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారన్నారు. వాహనమిత్ర పధకాన్ని సైతం సిగ్గులేకుండా విమర్శిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పధకాలలో లోపాలు ఉంటే చెప్పాలన్నారు. అంతేగాని ప్రతి విషయంపై చంద్రబాబు బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆక్షేపించారు. 



తెలుగుదేశం హయాంలో వందలాది దేవాలయాలను కూలగొట్టారన్నారు.  చివరికి కనకదుర్గ, శ్రీకాళహస్తి ఆలయాలలో క్షుద్రపూజలు చేయించిన నైజం చంద్రబాబుదని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సదావర్తి భూములు కాజేసేందుకు ప్రయత్నించి కోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంది ఎవరో రాష్త్ర ప్రజలందరికి తెలుసన్నారు. శ్రీవారి ఆలయంలో పోటును తవ్వించింది చంద్రబాబు హయాంలో కాదా అని నిలదీశారు. కనక దుర్గమ్మఆలయంలో కిరీటం పోయింది కూడా బాబు హయాంలోనే అని ఈ సందర్బంగా ప్రస్తావించారు.  వైయస్ జగన్ ఆలయమర్యాదలు పాటిస్తూ హిందూసంప్రదాయాలను గౌరవిస్తూ శ్రీవారి ఆలయంలోను, కనకదుర్గమ్మ ఆలయంలోను పట్టువస్త్రాలు సమర్పిస్తే అందులోను రాజకీయమేనా అని ప్రశ్నించారు. రైతులను, నిరుద్యోగులను,డ్వాక్రా మహిళలను ఇలా అందర్ని మోసం చేశావని చంద్రబాబు పై ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో  ఆయన చేసిన దుర్మార్గాలు దేశంలో ఎవరూ చేసి ఉండరన్నారు.





పార్టీ వ్యవస్దాపకులు ఎన్టీఆర్ ను ఏడిపించి చంపించింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. లక్ష్మీపార్వతిని మహిళ అని కూడా చూడకుండా నీచంగా వేధించడం, జూనియర్ ఎన్టీఆర్ ను సైతం వాడుకుని వదిలే సింది ఎవరో తెలియంది కాదన్నారు. వైయస్ జగన్ కుటుంబంపైన, వైయస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపైన సోషల్ మీడియాలో చేసిన దుర్మార్గాలు ప్రజలు మరిచిపోలేదన్నారు. పోలీసు వ్యవస్దను చంద్రబాబు ఎంతలా దిగజార్చి పాలన సాగించారన్నారు. జగన్ పాలనలో నిష్పక్షపాతంగా పనిచేస్తుంటే విమర్శిస్తున్నావని నిలదీశారు. చంద్రబాబులా తాము ఆలోచిస్తే.. ఆయన చేసిన అరాచకాలను బయటకు తీస్తే టిడిపి నేతలందరూ జైళ్లలో ఉంటారని గడికోట అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలన్నారు. లేదంటే మరింత అధోగతి పాలు కాకతప్పదని హెచ్చరించారు. వైయస్ జగన్ కి రాసిన లెటర్ లో తన నియోజకవర్గానికి సంబంధించిన ఓబులేసు అనే మోసగాడిని  వెనకేసుకువస్తూ మాట్లాడి తన స్దాయిని దిగజార్చుకున్నావని విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: