ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోల్లో బస్సులు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్ డిపోలతోపాటు బస్ స్టేషన్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో కొన్ని మార్గాలలో పోలీసుల భద్రత నడుమ అద్దె బస్సులతో పాటు ప్రయివేట్‌ వాహనాలు నడుస్తున్నాయి.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన క లెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలన్నారు. అవసరమైతే ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌లను వినియోగించాలని, అందుకుగాను ఆన్‌లైన్‌ అనుమతులు ఇవ్వాలని సూచించారు.

సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. వీసీలో రవాణశాఖ జాయింట్‌ కమిషనర్‌ మమత ప్రసాద్, కామారెడ్డి నుంచి కలెక్టర్‌ సత్యానారాయణ, జేసీ యాదిరెడ్డి, ఎస్పీ శ్వేత, జిల్లా రవాణాశాఖ అధికారి వాణి, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.  


చర్యలు తీసుకుంటున్నాం..సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన జనహిత భవన్‌లో ఆయాశాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కామారెడ్డి, బాన్సువాడ బస్‌డిపోల నుంచి 160 బస్సులే కాకుండా మరో వంద స్కూల్‌ బస్సులను వినియోగిస్తున్నామన్నారు. డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమిస్తామన్నారు. హెవీ వెహికల్‌ లైసెన్స్, ఆధార్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ వర్జినల్స్, 18 నెలల అనుభవం కలిగిన సర్టిఫికెట్‌లతో తాత్కాలిక డ్రైవర్లను నియమించుకుంటున్నట్లు తెలిపారు. నిర్ణీత రూట్‌లలో సమయానికి బస్సులను నడిపిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: