ఇరాక్ లో ప్రధాని అదిల్ కి వ్యతిరేఖంగా దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. బాగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది.  ఐదు రోజులుగా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. అయితే అల్లర్లలో సుమారు 73 మంది  మృతి చెందారు. మరో 1500 మంది వరకు గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్  కోతలను వ్యతిరేకిస్తూ .. ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వస్తున్నారు.


అవినీతి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఇరాక్‌ పౌరులు ఐదు రోజులుగా కొనసాగిస్తున్న నిరసనలు విస్తరించాయి. ఇప్పటి వరకు ఈ నిరసనల్లో జరిగిన హింసలో 73 మంది చనిపోయారు. 1500 మందికి పైగా నిరసనకారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు కాల్పులు, వాటర్‌ కెనాన్స్, భాష్పవాయు ప్రయోగాలకు వెరవకుండా ఇరాక్ వాసులు, ఎవరి నాయకత్వం లేకుండానే, ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి అదిల్‌ అబ్దెల్‌ మెహదీకి పౌరుల ఆందోళన పెద్ద సవాలుగా మారింది. షియాలు ఎక్కువగా ఉండే పట్టణాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనల్లో ప్రధాన రాజకీయ పార్టీల జోక్యాన్ని నిరసనకారులు వ్యతిరేకిస్తున్నారు. 


ప్రధాని అదిల్ బాగ్దాద్ లో  ఆంక్షలు విధించినా నిరసనకారులు ఏమాత్రం  లెక్కచేయలేదు. దేశ చిహ్నమైన లిబరేషన్ స్క్వేర్  వద్దకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు  ప్రయత్నించారు. దీంతో వారిపై  పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. కాగా ప్రభుత్వం గద్దె దిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు చెబుతున్నారు. నిరసన కారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని అదిల్ ప్రయత్నించారు. రాజకీయ సంక్షోభానికి  ముగింపు  పలకాలన్నారు. శాంతి భద్రతలు నెల కొల్పేందుకు సహకరించాలని ప్రధాని కోరారు. ఇరాక్‌లో షియాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అల్ దివానియాహ్ నగరంలో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇరాక్ దేశంలోని నసీరియాహ్, దివానియాహ్, బస్రా, బాగ్దాద్ నగరాల్లో నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఆదిల్ అబ్దెల్ ప్రభుత్వం రాజీనామా చేయాలనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించే వరకూ లెజిస్లేచర్లు, పార్లమెంటు సభ్యులు సమావేశాలు బహిష్కరించాలనే వాదన కూడా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: