ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనపై సీరియస్ అయ్యారు. డీజీపీ గౌతం సవాంగ్ కు అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దని జగన్ స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఎమ్మెల్యే మరియు అతని అనుచరులు తన ఇంటికి వచ్చి రభస సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ విషయం జగన్ దృష్టికి రావటంతో చట్టం అమలు చేసే విషయంలో స్వేచ్ఛగా పనులు చేసుకుంటూ పోవాలని, చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం చెప్పారు. ఎంపీడీవో సరళ ఫిర్యాదులో తన ఇంటిపై దాడి చేశారని, తన తల్లిని దుర్భాషలాడారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరుడికి సంబంధించిన లే అవుట్ కు వాటర్ కనెక్షన్ ఇవ్వటంలో కొంత ఆలస్యం జరగటంతో తన ఇంటిపై దాడి చేశారని ఎంపీడీవో సరళ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
కోటంరెడ్డి మాత్రం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి విషయంలో మాత్రం తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఒక అధికారిక లే అవుట్ కు వాటర్ కనెక్షన్ ఇవ్వాలని నేను కోరిన మాట మాత్రం వాస్తవమేననని చెప్పారు. ఎంపీడీవో సరళ కనెక్షన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వలేదని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు నేను ఎంపీడీవో ఇంటికే వెళ్లలేదని, ఎంపీడీవో ఇంటిపై దాడి చేశాననే ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. 
 
నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించిన కేసు నిన్న ఉదయం నమోదైంది. మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ఈ విషయం గురించి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తప్పు చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని జగన్ డీజీపీకి ఆదేశాలు ఇవ్వటంతో ప్రతిపక్షానికి జగన్ విమర్శించే అవకాశం లేకుండా చేశాడని చెప్పవచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే తప్పు చేస్తే చర్యలు తీసుకోమని సీఎం ఆదేశాలు ఇవ్వటంతో టీడీపీ పార్టీకి  జగన్ షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: