ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో, ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆటో కార్మికుల ఆర్థికసాయంపై టీడీపీ సిగ్గులేని ఆరోపణలు చేస్తుందని వారు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు పాలనకూ జగన్ పాలనకూ తేడా వివిరించారు.


ఆయన ఏమన్నారంటే.. “ 2014లో చంద్రబాబు సీఎం అయిన తరువాత చేసిన మొదటి ఐదు సంతకాలకు దిక్కే లేదు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి తూచా తప్పకుండా హామీలు అమలు చేస్తున్నారు. ఓర్వలేక టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మేనిఫెస్టో అమలు ఎన్నికలకు ముందు చేస్తారని, కానీ వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన గంటలోపే ఆ హామీలు అమలు చేయడం మొదలు పెట్టింది.


మే 14, 2018న వైయస్‌ జగన్‌ ఏలూరులో సొంత ఆటోలు, ట్యాక్సీలు ఉన్న డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తామని మాట ఇచ్చి నెరవేర్చారు. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రైతుల కోసం మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే..వైయస్‌ జగన్‌ రెండు అడుగులు వేశారు. ప్రతి రైతుకు రూ.12,500 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. చంద్రబాబు రైతులను, అక్కాచెల్లెమ్మలను రుణమాఫీ పేరుతో మోసం చేశారు.


మా నాయకుడు చెప్పినట్లుగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చిరస్థాయిగా నిలిచిపోయారు. 43 వేల బెల్టు షాపులు మూసివేయించారు. 20 శాతం మద్యం దుకాణాలను రద్దు చేశారు. అక్టోబర్‌ 2న మద్యం అమ్మారని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు.చేస్తున్న పనులను ప్రజలకు వివరించలేక టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. యువతను చంద్రబాబు మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని చంద్రబాబు ఇవాళ మాట్లాడటం సిగ్గుచేటు.. అంటూ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: