రెండు ముఖ్య‌మైన రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఎదురైంది. కీల‌క‌మైన మ‌హారాష్ట్ర, హ‌ర్యానా ఎన్నిక‌ల స‌మ‌యంలో...ఢిల్లీ రాజ‌కీయ‌ల‌పై ప్ర‌భావం చూప‌గ‌ల హర్యానాలో పార్టీకి ముఖ్య‌నేత గుడ్‌బై చెప్పారు.కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి ఈ ప‌రిణామం గట్టి ఎదురుదెబ్బ అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 


హర్యానా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించినప్పటి నుంచి త‌న్వ‌ర్‌ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తన రాజీనామాకు గల కారణాలు కాంగ్రెస్ నేతలందరికీ తెలుసునని, పార్టీ కార్యకర్తలతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సోనియాకు రాసిన లేఖ‌లో రాజకీయ ప్రత్యర్థుల వల్ల కాకుండా తీవ్రమైన అంతర్గత విభేదాల కారణంగానే పార్టీ పతనావస్థకు చేరుకుంటున్నదని పేర్కొన్నారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పార్టీ అధినాయకత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని త‌న్వ‌ర్‌ మండిపడ్డారు. ``రాహుల్‌గాంధీ ప్రోత్సహించిన యువ నేతలను తొలిగించేందుకు కొన్నేళ్లుగా కుట్రలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా నిలబడేందుకు దురదృష్టవశాత్తు ఈ కుట్ర బాధితులకు తగిన ధైర్యం లేదు. అయితే దీనికి వ్యతిరేకంగా పోరాడడం నా రాజకీయ కర్తవ్యంగా భావిస్తున్నా`` అని తన్వర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డర్టీ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ప్రాథమిక సిద్ధాంతాల నుంచి కాంగ్రెస్ పూర్తిగా దారితప్పిందని ఆరోపించారు. 


మ‌రోవైపు త‌న్వ‌ర్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఊహించ‌ని ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అశోక్ తన్వర్‌ను బీజేపీ ఆహ్వానించిందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆ పార్టీ నేత, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టంచేశారు. ఒకవేళ తన్వర్‌ను బీజేపీ ఆహ్వానించి ఉంటే, ఆయన ఇప్పటికే పార్టీలో చేరి ఉండేవారని చెప్పారు. తన్వర్‌ను బీజేపీలోకి చేర్చుకునే అవకాశాలు లేవని  క్లీన్ ఇమేజ్ ఉన్న వారినే పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: