వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించి, మెరిట్ జాబితా ప్రకారం ఎంపికైన వారికి ఉద్యోగాలను ఇచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రారంభం అయ్యాయి. రాయలసీమలో కొంతమంది బీకాం అర్హతతో వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శుల ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. 
 
చిత్తురు జిల్లాలో బీకాం డిగ్రీ అర్హతతో ఎంపికైన 41 మందికి రెండురోజుల క్రితం నియామక ఉత్తర్వులతో పాటు పోస్టింగ్ ఉత్తర్వులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శుల ఉద్యోగానికి బీకాం డిగ్రీ ఉన్నవారు అనర్హులని అధికారులు చెబుతూ ఉండటంతో షాక్ అవడం ఎంపికైన అభ్యర్థుల వంతయింది. చిత్తూరు జిల్లాలోని అధికారులు 16 మందిని నగరపాలక కార్యాలయానికి నిన్న పిలిపించారు. వారి ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు వారిని ఉద్యోగాలకు అనర్హులని ఉద్యోగానికి రాజీనామా చేయాలని సూచించారు. 
 
మొదట ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రకటించి నియామక ఉత్తర్వులు, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చి ఇప్పుడు ఉద్యోగాలకు రాజీనామా చేయమని చెప్పటంతో బాధితులు నగర పాలక కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఉద్యోగాలకు ఎంపికయ్యామని మొదట చెప్పి ఉద్యోగాలకు రాజీనామా చేయమని చెబుతూ ఉండటంతో ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తురు మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
సర్టిఫికెట్లు పరిశీలన చేసే సమయంలో కూడా తిరస్కరించని అధికారులు ఇప్పుడు ఉద్యోగాలకు అనర్హులని చెప్పటం దారుణం అని అన్నారు. బీకాం డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు పొందిన వారు ఇతర జిల్లాల్లో కూడా ఉన్నారని తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో 21, కడపలో 40, కర్నూలు జిల్లాలో 23 మంది బీకాం డిగ్రీ అర్హతతో వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శుల ఉద్యోగాలకు ఎంపికయినట్లు తెలుస్తోంది. . 



మరింత సమాచారం తెలుసుకోండి: