కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లా కూడథాయ్ ప్రాంతంలో నివాసం ఉండే రాయ్ థామస్ కు 14 సంవత్సరాల క్రితం జూలీ థామస్ తో వివాహమైంది. కానీ పెళ్లైన తరువాత జూలీ భర్త సోదరుడైన షాజుపై మనసు పడింది. ఆ తరువాత షాజు, జూలీ ఇద్దరూ కలిసి ఇంట్లోని కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని చంపటం మొదలుపెట్టారు. అందరిని ఒకేసారి చంపితే అనుమానం వస్తుందని 14 సంవత్సరాల నుండి ఒక్కొక్కరిని చంపుతూ వస్తున్నారు. 
 
మొదట జూలీ 2002 సంవత్సరంలో అత్త అన్నమ్మను చంపింది. ఆ తరువాత 2008 సంవత్సరంలో మామ టామ్ థామస్ ను చంపింది. 2011లో భర్త రాయ్ థామస్ ను, 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూను, 2016లో షాజు భార్య సిలీ మరియు సిలీ కుమార్తెను చంపింది. ఆ తరువాత మృతదేహాలను ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా స్మశానానికి తీసుకొనివెళ్లి పాతిపెట్టేది.  బంధువుల్ని, స్నేహితుల్ని వారివి సహజ మరణాలే అని చెప్పి నమ్మించింది. 
 
14 సంవత్సరాలలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవటంతో అనుమానం వచ్చిన వీరి బంధువు చార్లెస్ ఆరుగురి మరణంపై సందేహాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు స్మశానంలో పాతిపెట్టిన చోటు నుండి మృతదేహాలను బయటకు తీయించారు. ఆ తరువాత శవాలకు పోస్టు మార్టం చేయించారు. వైద్యులు పోలీసులకు చనిపోయిన ఆరుగురు సహజంగా చనిపోలేదని సైనైడ్ ప్రభావంతో చనిపోయారని నివేదిక ఇచ్చారు. 
 
పోలీసులు జూలీ థామస్ , షాజును అదుపులోకి తీసుకొని విచారించగా విచారణలో నిజాలు బయటకు వచ్చాయి. మటన్ సూప్ లో సైనైడ్ కలిపి ఇచ్చామని జూలీ పోలీసులతో చెప్పింది. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆస్తి కోసం  ఆరుగురిని జూలీ చంపిందన్న వార్త కేరళ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: