ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం ప్రయాణికులపై ఎంతగా పడుతుందో స్వయంగా అనుభవించే వారిని అడుగుతే తెలుస్తుంది.ఇక ఇప్పటికే సమ్మెను ఉదృతం చేసే దిశగా ఆలోచిస్తున్న కార్మిక సంఘాల విషయంలో తెలంగాణ సీయం కాస్త మెత్తపడ్డట్టు వున్నారనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు,ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఎలాగైనా సమ్మెను విరమింపజేసే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, వారి కొన్ని డిమాండ్లకు సమ్మతి తెలిపినట్లు సమాచారం. అయితే ఏయే డిమాండ్లను అంగీకరించాలన్న విషయమై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.


తొలుత వారి డిమాండ్లకు ఎట్టి పరిస్థితిలో తలొగ్గేది లేదని స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వోద్యోగుల జేఏసీ కూడా వారి వెంట నడవాలని నిర్ణయించడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడుతుండటంతో, సీఎం కేసీర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని రాజకీయవర్గాల సమాచారం. కాగా, ప్రభుత్వ ధోరణిలో కాస్త మార్పు కనిపిస్తున్న నేపధ్యంలో... ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా ఓ ప్రకటన వెలువడే అవకాశముందని కార్మిక సంఘాలు ఆశిస్తున్నాయి.


ఇదిలా ఉండగా... ప్రస్తుత డిమాండ్లలో అత్యంత ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త పీఆర్సీ అమలు లాంటి వాటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఓ కార్మిక సంఘ నేత స్పష్టం చేసారు. మొత్తానికి ప్రధాన డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు ఖరాఖండిగా చెబుతున్నారు. ఇక సీఎం క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్‌లో ఆదివాయం ఉదయం నుంచి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.


ముందుగా ‘సమ్మెను విరమించి, వెంటనే విధుల్లోకి రావాలి’అని మరోసారి పిలుపునివ్వాలని అధికారులకు సీఎం సూచించినట్టు సమాచారం.ఇదే క్రమంలో,కార్మిక సంఘాల నేతలు సానుకూలంగా స్పందించిన పక్షంలో కొన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి, కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది...

మరింత సమాచారం తెలుసుకోండి: