ఈఎస్‌ఐ కుంభకోణంలో తవ్వినకొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. మెడికల్‌ ఏజన్సీలు, ఫార్మా కంపెనీలు, మెడికల్‌ క్యాంపులు.. .ఇలా ఏ ఒక్క అవకాశాన్నీ వదలకుండా... వందల కోట్లు దారి మళ్లించేశారు నిందితులు. ఏసీబీ అధికారులు ఏ ఒక్కరిని విచారించినా.. కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి . తాజాగా జాయింట్‌ డైరెక్టర్‌ పద్మకు చెందిన బినామీ కంపెనీలు బయటపడటంతో... ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు.


ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది.. వస్తే గిస్తే జీతం... రిటైర్‌ అయితే కొద్దిపాటి సొమ్ము చేతికందుతుంది. బట్‌... కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు... ఒకేసారి కోట్లు కొల్లగొట్టారు ఈఎస్‌ఐ స్కామ్‌ నిందితులంతా. ఏసీబీ దర్యాప్తులో రోజుకో తరహా మోసం వెలుగుచూస్తోంది. మందులు సరఫరా చేయకుండానే చేసినట్టు లెక్కల్లో చూపించి బిల్లులు క్లెయిమ్‌ చేసుకున్నారు. నకిలీ ఇండెంట్లను సృష్టించి...ఒరిజినల్ ఇండెంట్లను ప్రైవేటు వ్యక్తుల ఇళ్లల్లోకి చేర్చారు. కోట్ల రూపాయల బిల్లులను క్షణాల్లో అప్రూవ్‌ చేయడంతో పాటు కంపెనీలతో కుమ్మక్కై.. ఆ సొమ్మును తిరిగి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించేసుకున్నారు. ఇక మెడికల్‌ క్యాంపుల పేరుతో చేసిన కోట్ల రూపాయల స్కామ్‌కు అంతులేకుండా పోయింది. ఇలా చెప్పుకుంటే పోతే...అసలు స్కామ్‌ ఇన్ని రకాలుగా చేయొచ్చన్నది డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ అండ్‌ బ్యాచ్‌  నిరూపించేశారు. అరెస్ట్ అయి జైళ్లో ఉన్న నిందితులతో పాటు... పరోక్షంగా సంబంధం ఉన్న అందరినీ ఏసీబీ ప్రశ్నించింది. ప్రతీ సారి కొత్త విషయం వెలుగు చూస్తుండటంతో ఏసీబీ అధికారులు సైతం షాకయ్యారు. లోతుగా దర్యాప్తు జరుపుతుంటే... అవినీతి తిమింగళాల కథలు బైటపడుతున్నాయి.


ఈ కేసులో ఏ 2 నిందితురాలిగా ఉన్న జాయింట్‌ డైరెక్టర్ పద్మ... ఏకంగా తన తల్లిపేరుపై కంపెనీలను సృష్టించేసింది . బాలానగర్‌ లోని వెంకటేశ్వర ఆక్యుపేషనల్‌ హెల్త్‌ సెంటర్‌తో పాటు దూలపల్లిలోని దత్త ఇండస్ట్రీలు పద్మ తల్లితో పాటు అరవింద్‌రెడ్డి అనే వ్యక్తి  పేర్లపై ఉన్నాయని తెలుసుకున్న ఏసీబీ అధికారులు... భూపాలపల్లి జిల్లాకు చెందిన అరవింద్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని నిజాలు తెలిశాయి. ఢిల్లీలో హోమియోకు సంబంధించి కోర్సు చేసిన అరవింద్‌రెడ్డి... ఈఎస్‌ఐ అధికారులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఓ ఫార్మా కంపెనీలో కాంట్రాక్ట్‌ హెల్త్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్న అరవింద్‌రెడ్డి... బాలానగర్‌లో వెంకటేశ్వర ఆక్యుపేషనల్‌ హెల్త్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. ఇంతింతై వటుడింతై అన్న సామెత మాదిరి.. దూలపల్లిలో దత్త ఇండస్ట్రీ, చింతల్‌లో మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు... ఈ కేసులో ఏ 2 నిందితురాలుగా ఉన్న పద్మతో చేతులు కలిపాడు. ఏకంగా పద్మ తల్లి పేరుపై దత్త ఇండస్ట్రీ , బాలానగర్‌లోని వెంకటేశ్వర హెల్త్‌ సెంటర్‌ తో అక్రమాలకు తెరలేపాడు. జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న పద్మ అండదండలు చూసుకొని మెడికల్‌ క్యాంపు పేరుతో అరవింద్‌రెడ్డి చేసిన అక్రమాలు చాలానే ఉన్నాయని గుర్తించింది ఏసీబీ . ఈఎస్‌ఐలోని జనరల్‌ మెడిసిన్స్‌తో పాటు సర్జికల్‌, టెస్టులకు సంబంధించిన ఎక్విప్‌మెంట్స్‌ను  దుర్వినియోగం చేయడంతో పాటు... కిట్స్‌ను అరవింద్‌రెడ్డి ఏకంగా బ్లాక్‌మార్కెట్‌లో అమ్మినట్టు గుర్తించింది ఏసీబీ. అరవింద్‌రెడ్డిని తమ అదుపులోకి తీసుకున్న ఏసీబీ...దూలపల్లిలోని దత్త ఇండస్ట్రీ , బాలానగర్‌లోని వెంకటేశ్వర హెల్త్‌ సెంటర్‌తో పాటు చింతల్‌లోని ల్యాబ్‌ , సుచిత్ర సమీపంలోని ఆయన ఇంట్లోనూ ఏక కాలంలో దాడులు చేసింది. ఈఎస్‌ఐలో అసలు రికార్డులే లేకుండా చేసిన అనేక పత్రాలను బాలానగర్‌లోని అరవింద్‌రెడ్డి కంపెనీలో స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. కోట్ల రూపాయలను అరవింద్‌రెడ్డి , పద్మలు దారిమళ్లించినట్టు గుర్తించింది ఏసీబీ.    


ఓ వైపు సోదాలు చేస్తున్న ఏసీబీ... మరోవైపు ఇప్పటికే ఆధారాలు సేకరించిన వారిని అరెస్టులు చేస్తుంది. ఫార్మా కంపెనీ ఎండీ సుదాకర్‌రెడ్డి ని శనివారం అరెస్టు చేసిన అధికారులు...ఆయన ఇచ్చిన సమాచారంతో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న నాగలక్ష్మిని ఆదివారం అరెస్టు చేశారు . సుదాకర్‌రెడ్డితో కలిసి నాగలక్ష్మి దాదాపు ఎనిమిదిన్నర కోట్ల మందులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దీంతో ఆదివారం నాగలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టైన వారి సంఖ్య పదికి చేరింది. మరోవైపు ఏసీబీ బృందాలు జరుపుతున్న సోదాలు చూస్తుంటే ..మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు లేకపోలేదు. అధికారులతో పాటు మద్యవర్తులుగా వ్యవహరించిన దళారులు, ప్రైవేటు వ్యక్తుల పాత్రపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు ఏసీబీ అదికారులు . మరోవైపు ఏడుగురు నిందితులను కోర్టు కస్టడీకీ అనుమతించడంతో 9, 10 తేదీల్లో ఏసీబీ విచారణ జరపనుంది. వీరి నుంచి మరిన్ని నిజాలు బయటపడే అవకాశాలున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: