తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై పీకలదాకా కోపంతో ఉన్నారు. తాను ఎన్ని చెప్పినా సమ్మెకు దిగారని అందులోనూ దసరా వంటి పండుగ ముందు ప్రజలను ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు. అందుకే ఇక వారితో చర్చలు లేవంటున్నారు. అంతే కాదు..అసలు దేశంలోని ఆర్టీసీల సంగతి ప్రస్తావిస్తున్నారు.


మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదంటున్నారు కేసీఆర్. బీహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నామ మాత్రంగా వున్నాయంటున్నారు. ఆ విధంగా చూస్తే కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?” అని అంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.


సమ్మెద్వారా ప్రజలకు ఎంతో అసౌకర్యం కలిగిందని. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా విధులకు హాజరవని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోమని తెగేసి చెబుతున్నారు. గడపదాటితే బయటికే .. మళ్లీ గడపలోకి వచ్చే సమస్యే లేదంటున్నారు. విలీనం గురించి అఖిల పక్ష సమావేశం జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆర్టీసీ విషయంలో మాట్లాడే హక్కులేదట.


సీపీఎం అధికారంలో వున్నా, నాడు, పశ్చిమ బెంగాల్ లొ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా? కేరళలో చేసారా? అని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్.. బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో వుంది కాని ఎక్కడైనా విలీనం చేసారా ? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనైనా చేశాయా? అందుకే వాళ్లకు అడిగే హక్కు లేదు.. అంటున్నారు కేసీఆర్.. అఖిల పక్ష సమావేశం డిమాండ్ అసంబద్ధం. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్ళూ తెరిపించాలంటున్నారు.


అంత వరకూ బాగానే ఉంది. కానీ ఎక్కడిదాకో ఎందుకు.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి కేసీఆర్ మరిచిపోయారా... అదీ గాక మిగిలిన రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే.. ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ నిన్న మొన్నటి వరకూ కలిసే ఉన్నాయి. మరి కేసీఆర్ ఎందుకో ఏపీఎస్ ఆర్టీసీ ఊసే ఎత్తడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: