ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన అహంకారానికి పరాకాష్ట అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనపక్ష నాయకులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అయన తీవ్రంగా ఖండించారు.  ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమన్నారు. కార్మికులు తమ తమ  కోరికలను నెరవేర్చుకోవడం కోసం సమ్మె బాట పట్టడం సర్వ సాధారణమైన అంశమన్నారు. ఈ దేశం ఇచ్చిన కార్మిక చట్టాల ద్వారా.. సమ్మె చేయడం ఒక భాగమని స్పష్టం చేశారు. 
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కార్మికులతో చర్చలు జరిపి సమస్యకు ఒక సానుకూల పరిష్కారం చూపడం ప్రభుత్వ సామజిక బాధ్యత  అని భట్టి అన్నారు. సమ్మెకు దిగిన ఉద్యోగులతో చర్చలు జరపక పోవడాన్ని ఆక్షేపించారు. కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంభావనికి నిదర్శనమని మండిపడ్డారు. 
ఆర్టీసీ నష్టాల బాటలో పయనించడానికి కార్మికులు కారణం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పై అధిక పన్నులు వేసి ఆర్టీసీ నష్టాలకు కారణం అయిందన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఆర్టీసీ అనేది ప్రభుత్వం ఆస్తి అని నొక్కి చెప్పారు.  ఆ ఆస్తులను ప్రభుత్వం సంరక్షించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయనలోని ఫ్యూడల్ మనసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఒక  రాచరిక పరిపాలన చేస్తున్నట్లు ఉంది తప్ప.. ప్రజాస్వామ్య పాలన చేస్తున్నట్లు లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులనువు తొలగిస్తున్నట్లు సీఎం  చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ వ్యవహారంలో ముఖ్యమంత్రి వ్యహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఆ సంస్థను ఆక్రమించుకునేందుకు అంతర్లీనంగా కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని భట్టి ఆరోపించారు. ఏదిఏమైనా తాము కార్మికుల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: