తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారులు వివరించారు. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలన్న కేసీఆర్.. ఈ అంశంపై లోతుగా అధికారులతో చర్చించారు. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.


కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ పాండురంగనాయకులున్నారు. వాళ్ళు తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పిస్తారు. గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం ఒక నిరంతర సమస్యాత్మకం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని కేసీఆర్ వారికి చెప్పారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేకరంగాలలో ముందుకు దూసుకుపోతున్నది. ఈ నేపధ్యంలో ఆర్టీసీ లాంటి సమస్యలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా మారాయి. ఇప్పుడు ఆర్టీసీ చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకం, ఆలోచనా తప్పిదం, భాద్యతారాహిత్యం. ఇప్పుడు రాష్ట్రానికి ఈ విషయంలో శాశ్వతమైన లాభం చేకూరాలి.. అని కేసీఆర్ కమిటీ సభ్యులకు చెప్పారు. ఈ కమిటీ సోమవారం తన రిపోర్ట్ ఇవ్వనుంది.


ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: