ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రవాణాశాఖ మంత్రితోపాటు.. సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్, ఆర్టీసీ యాజమాన్యంతో ఆయన ఐదు గంటలకు పైగా సమీక్ష నిర్వహించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌...ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు  ప్రకటించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవని కేసీఆర్ అన్నారు.  అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని ఆదేశించారు. కండీషన్లతో కూడిన రిక్రూట్ మెంట్ ఉంటుందన్నరు. కొత్తగా వచ్చే సిబ్బంది.. యూనియన్లలో చేరబోమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలన్నారు. ఏఏ విభాగాలకు చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో.. ఆయా విభాగాల్లో ఉద్యోగులను భర్తీ చేస్తామన్నారు. ఇకపై ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యం బస్సులుంటాయని నిర్ణయించారు. 15 రోజుల్లో ఆర్టీసీని పూర్వస్థితికి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు.


కాగా, సీఎం కేసీఆర్ నిర్ణ‌యంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుదల చేసి తెలంగాణ సీఎం తీరును త‌ప్పుప‌ట్టారు. తమ హెచ్చరికలను లెక్కచెయని వారందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయం ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా ఉందని  బీజేపీ భావిస్తుందని తెలిపారు. ఏ కారణం లేకుండా ఈ ఏకపక్ష చర్య తీసుకునే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదని అన్నారు. సీఎం  ఉత్తర్వులు కోర్టులలో సవాలు చేస్తే అవి నిలబడవని ల‌క్ష్మ‌ణ్ విశ్లేషించారు. అంతేకాకుండా ఎప్పటికీ అమలు కావని స్ప‌ష్టం చేశారు.


ఇది ప్రజాసామ్య దేశమని ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోయినట్లు అనిపిస్తుందని ల‌క్ష్మ‌ణ్ ఎద్దేవా చేశారు. వేలాది మంది ఉద్యోగులపై రాత్రికి రాత్రి ఏకపక్ష నిర్ణయాలు హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెపై బీజేపీ మొదటి నుండి హెచ్చరిస్తూ వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  పోరాటంలో కేసీఆర్ వెంట ఉన్న ఆర్టీసీ కార్మికులపై  అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని బీజేపీ భావించింద‌న్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించాలని సీఎం కేసీఆర్ తన అనాలోచిత  నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు పండుగ రోజున రోడ్లపైకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడినందుకు రాష్ట్రంలోని ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చే  బహుమతి ఇదా అని ప్ర‌శ్నించారు. ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు సీఎం కేసీఆర్ ఆర్టీసీ జెఎసి నాయకులను ఒక్కసారి కూడా కలవలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను వెంటనే  పరిష్కరించడానికి ప్రయత్నించకుండా, సీఎం కేసీఆర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే తీవ్ర  పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ హెచ్చరిస్తుందని ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: