జగన్ ఎందుకో మౌన ముని అయిపోయారు. యూపీయే సర్కార్లో  రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ జగన్ని ఆవహించినట్లుగా ఉన్నారు. ఎంతటి కీలకమైన విషయలైనా కూడా జగన్ పెదవి విప్పితే ఒట్టు. బహుశా అది ఒక రాజకీయ వ్యూహం కావచ్చు. కానీ అన్నిటికీ ఒకటే వ్యూహం అంటే కుదరదేమో. కొన్ని విషయాలు ముఖ్యమంత్రి చెబితేనే అందంగా ఉంటుంది. క్లారిటీగా కూడా ఉంటుంది. మరి జగన్ మౌనంగానే ఉంటున్నారు.


జగన్ సడెన్ గా ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఆయన సొంత పేపర్లో వచ్చిన కధనం ప్రకారం రైతు భరోసా కార్యక్రమానికి ప్రధానిని ఏపీకి పిలుస్తున్నారని  సమాచారం ఉంది. ఇక ఆ ఒక్క పని మాత్రమే కాదు ఏపీకి నిధుల సాయం గురించి జగన్ అడిగారని కూడా రాశారు. ఇక ప్రత్యేక హోదా గురించి ప్రధానికి గుర్తు చేశారని రాశారు. అమరావతి రాజధానికి, పోలవరానికి భారీగా  నిధుల సాయం చేయమని కోరారని కూడా చెప్పుకొచ్చారు.


అన్నీ బాగానే ఉన్నా ప్రధాని మోడీతో గంటన్నర సేపు జగన్ భేటీ వేశారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి. వాటిలో రాజకీయాలు కూడా ఉంటాయి. రాజకీయాలు జనాలకు అవసరం లేదు కానీ ఏపీకి ఫలనాది అడిగాను, ఇది నేను అడిగినది, ప్రధాని ఇలా చెప్పారు అని జగన్ మీడియా ముఖంగా నాలుగు మాటలు చెబితే బాగుంటుందేమో. అదే విధంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏపీ జనం కూడా నిబ్బరంగా ఉండే అవకాశం ఉంది


ఒక విధంగా జగన్ కి రాజకీయంగా కూడా ఇది లాభమే. మా కోసం ఢిల్లీ వెళ్ళి ప్రధానిని ఇది కోరారు అని సంత్రుప్తి చెందుతారు. ఇదే చంద్రబాబు అయి ఉంటే ఢిల్లీలో ఒక మీడియా మీటింగ్, హైదరాబాద్ లో మరో మీటింగ్, అమరావతిలో ఇంకోటి ఇలా పెట్టి చెప్పుకుంటూ పోయేవారు మరీ అంతలా బోర్ కొట్టించనక్కరలేదు.


కానీ అయిదు కోట్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ 130 కోట్ల ప్రజల ప్రతినిధిగా ఉన్న ప్రధాని మోడీతో జరిపిన చర్చలు వినాలని  ఆసక్తిగా ఉన్నారు. అది వారి హక్కు కూడా. ఇది జగన్ సొంత వ్యవహారం కాదు అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్న మాటలు రోటీన్ విమర్శలుగా తీసుకోనక్కరలేదు. వాటి విషయంలో జగన్ తన హస్తిన పర్యటన వివరాలు బయటపెడితే బాగుంటుందని అంటున్నారు. మరి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: