మారుతున్న కాలాంతో పాటుగా పెరుగుతున్న మోసాలు,రోజుకో కొత్తవేషంతో వస్తున్న సైబర్ కేటుగాళ్లూ. వీరి నుండి చాల మంది తప్పించుకోలేక వారి బారినపడి తెలియక తమ నగదును కోల్పోతున్నారు. తెలిసాకా లబోదిబోమంటూ బ్యాంకుకు,తర్వాత పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెడుతున్నారు.ఇలాంటి మోసాల విషయాల్లో ఎంత అవగాహన కల్పిస్తున్నా.. రోజుకు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలబారిన పడి, ఖాతాల్లో నుంచి సొమ్మును పోగొట్టుకుంటున్న వారు ఉంటూనే ఉంటారు. అవగాహన పెరగడం, సాంకేతికంగా కొత్త మార్పులు రావడంతో సైబర్‌ నేరగాళ్లు కూడా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.


మొబైల్‌ ఫోన్ల ద్వారా డిజిటల్‌ నగదు లావాదేవీలను నిర్వహిస్తున్న వారి వివరాలను తెలుసుకొని, వారి ఖాతాల్లో నుంచి లక్షల్లో బదిలీ చేసుకుంటున్నారు. మొబైల్‌ ఫోన్లలో యూపీఐ యాప్‌ వినియోగిస్తున్న వారందరూ భవిష్యత్తులో సైబర్‌ నేరస్థులకు లక్ష్యాలేనని పోలీసులు, సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక ఏటీఎం కేంద్రాల్లో దాగున్న దొంగ కళ్లు స్కిమ్మింగ్‌ యంత్రాల ద్వారా తస్కరించిన వివరాలతో క్లోనింగ్‌ చేసి డెబిట్‌ కార్డులను రూపొందిస్తున్నాయి.మ్యాగ్నటిక్‌ కార్డు రీడర్‌తో డెబిట్‌ కార్డుల వివరాలను దొంగిలించి నిలువుదోపిడీ చేస్తున్నాయి.


ఇటీవల ముంబయిలోని ఓ ఏటీఎం నుండి డెబిట్‌ కార్డు సహయంతో  రూ.50వేల నగదు విత్‌డ్రా చేసినట్లు ఓ వ్యక్తికి సంక్షిప్త సమాచారం వచ్చింది. అసలు ఆయన ఎప్పుడూ ముంబయి వెళ్లనే లేదు. డెబిట్‌ కార్డూ తన వద్దే ఉంది. ఏటీఎంలలో స్కిమ్మింగ్‌ పరికరాన్ని అమర్చి డెబిట్‌ కార్డు వివరాలను తస్కరించటం ద్వారా అతని ఖాతాలోని నగదు మాయమైందని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇతనొక్కడే కాదు,సైబర్ నేరగాళ్ల వలలో పడి ఇలా చాలమంది మోసపోతున్నారు. ఇలాంటి నేరాలతో సైబర్ నేరగాళ్లూ దేశ వ్యాప్తంగా 223.22 కోట్లు కొల్లగొట్టగా,ఇదే సమయంలో ఏపీలో చేసిన 40 నేరాల్లో సుమారుగా 90 లక్షల వరకు నగదు మాయమైంది.


ఇలా రికార్డ్‌ల్లో ఎక్కిన నేరాలే ఇన్ని వుంటే లెక్కలోకి రాకుండా ఇంకా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలియదు. ఇలా ఎన్ని కోటాను కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారో అర్ధం చేసుకోండి.అందుకే ఏటీయం సెంటర్లో చాలా జాగ్రత్తగా నగదును తీసుకోవాలి.అపరిచిత వ్యక్తులను అసలే నమ్మరాదు.ఎవరికి మీ పాస్‌వర్డ్ అసలే చెప్పకూడదు.ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్స్ వున్న ఏటీయం లోకి వెళ్లడానికే ప్రయత్నించండని అధికారులు తెలియచేస్తున్నారు.ఇకపోతే  నేరగాళ్లు మోసపూరితంగా నగదును కొల్లగొట్టేందుకు ఫోన్లు చేస్తుంటారు.


ఈ విషయం తెలియకుండా.. వారి మాటలకు మోసపోయి చాలామంది పాస్‌వర్డ్‌, పిన్‌ నెంబర్లు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఎవరైనా ఫోన్‌ చేసి కార్డు మార్చాలి, పిన్‌ నంబరు చెప్పండి అంటే నమ్మకూడదు. ‘బ్యాంకు అధికారులు ఎప్పుడూ నేరుగా ఖాతాదారులకు ఫోన్‌ చేయరు’ ఈ ఒక్క విషయంపై అవగాహన పెంచుకుంటే చాలు. మీ నగదు లావాదేవీలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు సంబంధించిన వ్యవహరాలను సమీపంలోనే బ్యాంకు శాఖకు వెళ్లి తెలుసుకునే అవకాశాలున్నాయి. మీకు అనుమానం వచ్చిన వెంటనే బ్యాంకుకు నేరుగా వెళ్లండి. మోసపోయామని గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: