తెలంగాణ వస్తే విద్యార్థులు,  నిరుద్యోగుల బ్రతుకులు బాగుపడతాయి... మెరుగైన విద్య విద్యార్థులకి లభిస్తుందని విద్యార్థులు కలలు కన్నారు . కానీ ఎంతో ప్రసిద్ధి పొందిన కాకతీయ విశ్వ విద్యాలయంలో పరిస్థితి చూస్తే మాత్రం విద్యార్థులు కలలు కన్న విద్య కల్లలే అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచి ఎందరో మేధావులను తయారు చేసిన కాకతీయ విశ్వ విద్యాలయం... కనీస సౌకర్యాలు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. కాకతీయ యూనివర్సిటీ పై ప్రభుత్వం చొరవ చూపక సరైన నిధులు మంజూరు చేయకపోవడంతో కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. 

 

 

 

 

 

 650 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న కాకతీయ యూనివర్సిటీలో... 19 బ్రాంచ్ లు  నిర్వహిస్తున్నారు. కానీ ఎంతోమందికి మేధాసంపత్తిని అందించిన ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో ... ప్రస్తుతం విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. ఎందుకంటే ఇక్కడ సిబ్బంది కొరత ఎక్కువగా  ఉంది. సిబ్బంది కొరతతో  సరైన విద్యా బోధన జరిగక ... విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. గత పదేళ్ల నుంచి ఖాళీగా ఉన్న బోధన,  బోధనేతర సిబ్బంది పోస్టులను ఇప్పటివరకు భర్తీ చేయలేదు ప్రభుత్వం. దీన్ని బట్టి చూస్తే ఎంతో ప్రతిష్ట కలిగిన కాకతీయ యూనివర్సిటీ పై ప్రభుత్వం ఎంత  చిన్నచూపు చూస్తోందని స్పష్టంగా అర్థమవుతుందని  అక్కడి విద్యార్థుల భావిస్తున్నారు. కాగా  2010 సంవత్సరంలో శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ లో ఏర్పాటు కావడంతో కరీంనగర్ కాకతీయ యూనివర్సిటీ నుంచి  విడిపోగా.... ప్రస్తుతం వరంగల్ ఖమ్మం కొత్తగూడెం ఆదిలాబాద్ జిల్లాలు  కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి.

 

 

 

 

 

 కాకతీయ యూనివర్సిటీ లో మొత్తం 391 మంది ప్రొఫెసర్లు అవసరం  ఉండగా... ప్రస్తుతం విధులు నిర్వహిస్తుంది 128 మంది మాత్రమే. ఇంకా 260 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. కాకతీయ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ల కొరత ఉండడంతో... ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులకు మెరుగైన విద్య అందడం లేదు. కాగా  కాకతీయ యూనివర్సిటీ కి ఎన్నిసార్లు నిధులు మంజూరు చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. మెరుగైన ప్రయోగశాలలు సహా వివిధ  అభివృద్ధి పనుల  కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరితే... ప్రభుత్వం మంజూరు చేసింది మాత్రం 15 కోట్లు మాత్రమే. దీంతో  కనీస అభివృద్ధికి కూడా నోచుకోవడం లేదు కాకతీయ యూనివర్సిటీ. ఇక ఉన్నత విద్యను అభ్యసించడానికి కాకతీయ యూనివర్సిటీ కి వచ్చిన పేద విద్యార్థుల నుంచి కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు అక్కడి సిబ్బంది.

మరింత సమాచారం తెలుసుకోండి: