గత మూడు రోజుల నుంచి తెలంగాణలో టీఎస్ఆర్టీసీ సమ్మే చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు. ప్రభుత్వం నియమించిన కమిటీ తమమాటను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ తో జేఎసీ నేతలు సమ్మె బాట పట్టారు. అయితే తాము విధులకు హాజరు కాకపోతే డిస్మిస్ చేస్తామని కెసిఆర్ బెదిరిస్తున్నారు. మరి కెసిఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదు. మరి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని మహిళా కార్మికులు ప్రశ్నిస్తున్నారు.  మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయాలు చేస్తున్నామని చెబుతున్నా అవి పూర్తి స్థాయిలో చేయలేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో మరోసారి సీఎం కేసీఆర్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. 

తెలంగాణలో సమ్మెకు దిగి, ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న దాదాపు 46 వేల మంది కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.  ఈ నేపథ్యంలో కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా నేడు మరోసారి ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. నిన్నటి రివ్యూ మీటింగ్ కు కొనసాగింపుగా నేటి సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.కాగా, విపక్ష పార్టీలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తూ, నిరసనలకు దిగుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: