తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ సంస్థ మనుగడకు కొన్నిచర్యలు తప్పవని, సంస్థ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు  ప్రకటించారు. ఇందులో భాగంగా,ఉద్యోగులు విధుల్లోకి రాని క్యాటగిరీల్లో కొత్తగా నియామకాలు జరుపుతామని చెప్పారు. దీనిపై జనసేన పార్టీ త‌న వైఖరిని వెలువ‌రించింది. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని  అభిప్రాయపడుతోందని ప‌త్రికా ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. 


ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఏటా రూ.1200 కోట్ల నష్టం, రూ.5000 కోట్ల రుణభారం, క్రమంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నదని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్‌లో దిగినవారితో ఎలాంటి రాజీలేదని, వారు తీవ్ర తప్పిదంచేశారని సీఎం అన్నారు. వారితో ఎలాంటి చర్చలు జరిపేది స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే ప్రసక్తేలేదని చెప్పారు. భవిష్యత్‌లో ఆర్టీసీలో క్రమశిక్షణారాహిత్యం, బ్లాక్‌మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం విధించిన గడువు లోపు విధులకు హాజరుకాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేదిలేదని స్పష్టంచేశారు.


ఈ నేప‌థ్యంలో, జ‌న‌సేన ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలంగాణ ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తుకు చేశారు.  తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్.టి.సి. ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని, వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసి ఉందని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా గ‌తాన్ని గుర్తు చేశారు. 


ప్రస్తుతం  అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉభయులకూ విజ్ఞప్తి చేస్తున్నానని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశాం. ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైనా వుంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని, తెలంగాణ ఆర్.టి.సి. సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని   ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరావు గారిని  కోరుతున్నాను. `` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: