మహారాష్ట్ర ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇక ఇదే సమయంలో మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఓ బి జె పి కార్పొరేటర్ కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఒకపక్క మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా బిజెపి కార్పొరేటర్ అతని నలుగురు కుటుంబ సభ్యులతో దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా సంచలనం కలిగించింది.

ఆదివారం రాత్రి బీజేపీ కార్పొరేటర్ రవీంద్ర ఖరత్ ఆయన కుటుంబ సభ్యులను గుర్తు తెలియని ఆగంతకులు ఆయన నివాసంలోనే దారుణంగా కాల్చి చంపారు. నాటు తుపాకీ మరియు కత్తులతో రవీంద్ర ఖరత్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో రవీంద్ర ఖరత్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుండి పారిపోయారు. తర్వాత వారు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. వారి వద్ద నుండి పోలీసులు నేరానికి ఉపయోగించిన ఆయుధాలైన పిస్టల్ లను, అలాగే కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయినా లాభం లేకపోయింది. చికిత్స చేస్తున్న సమయంలో వారు మరణించారు. ఈ దాడిలో మరణించిన వారిలో రవీంద్ర ఖరత్ తో పాటు ఆయన సోదరుడు సునీల్, ఆయన కుమారులు ప్రేమ్ సాగర్, రోహిత్ మరియు గజారే అనే వ్యక్తి ఉన్నట్లుగా పోలీసులు ప్రకటించారు.

హత్యకు గల కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలా , లేకా రాజకీయ కక్షలా అన్నది తెలియాల్సి వుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బజర్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో తాజా సంఘటన కలకలం రేపుతుంది. బీజేపీ శ్రేణులను షాక్ కు గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: