తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తో పాటు పోరాడిన  ఆర్టీసీ కార్మికులకు కెసిఆర్ అన్యాయం చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపడుతున్నారు.   కేసీఆర్ తీసుకున్న నిర్ణయం   ఆర్టీసీ కార్మికులతో పాటు, మిగిలిన ప్రభుత్వ రంగ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. తెలంగాణ  సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం విధుల్లో ఉన్న 1200మంది కార్మికులు మినహా మిగతా అందరిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 


కొత్తగా చేరేవాళ్ళు  ఏ యూనియన్‌లోచేరకూడదు అనే షరతుతోనే చేర్చుకుంటామనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మండి పడ్డారు. ఆర్టీసీ కార్మికులు మీ ఇంట్లో పనిచేసే పాలేర్లు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలని కేసీఆర్‌ను హెచ్చరించారు. తెలంగాణ మీ గులాంగిరీ కాదు.. జాగిరి కాదు.. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులను డిస్మిస్ చేసి కొత్తవాళ్లను రిక్రూట్ చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.  కొత్తగా చేరే ఉద్యోగులను కూడా ఏ యూనియన్‌లో చేరవద్దన్న షరతుతోనే చేర్చుకుంటామనడం నియంత్రుత్వమే అన్నారు.


అలాంటప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మాత్రం ఎందుకు అని నిలదీశారు.  రాష్ట్రంలో బీజేపీ తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను వాడుకున్న కేసీఆర్.. 'ఓడ దాటేదాక ఓడ మల్లయ్య , ఓడ దాటాక బోడి మల్లయ్య' అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడిందని.. అందుకే ప్రైవేట్ పరం చేసే చర్యలకు పూనుకుంటున్నాడని ఆరోపించారు. ఇప్పటికే పలు డీజిల్ బంకులు కేసీఆర్ సన్నిహితుల పరం అయ్యాయని.. భవిష్యత్‌లో ఆర్టీసీ ఆస్తులు కూడా కాజేస్తారని ఆరోపించారు. బినామీలతో టెండర్లు వేయించి ఆర్టీసీని కొల్లగొట్టడానికి కేసీఆర్ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

  ఆర్టీసీకి చెందిన కేవలం రూ.2400కోట్లు రుణభారం భరించలేని కేసీఆర్.. రాష్ట్రం కోసం చేసిన రూ.3లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారని నిలదీశారు. కేసీఆర్,మెఘా కృష్ణారెడ్డి కలిసి ఆర్టీసిని అమ్ముకోవడానికి సిద్దమయ్యారని ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులంతా త్యాగాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నియంతలు వచ్చారు.. పోయారని.. కేసీఆర్‌కు కూడా అదే దుర్గతి పడుతుందని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: