కచ్చులూరు బోటు ప్రమాదం జరిగి 21 రోజులు గడిచినా.. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వేతో సరిపెట్టి ఒక్క రోజు కూడా ఘటనాస్థలానికి వెళ్లి చూడకపోవడం, సమీక్ష నిర్వహించకపోవడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు.  ప్రమాద ఘటనలో ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిందని చెప్పిన ఒక బాధిత కుటుంబం కూడా లేకపోవడం బాధాకరం. ది.18.09.2019న ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం.242లోనే 11 గంటలకు బోటు ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలిపారు. 

ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమైన షెడ్యూల్స్‌ లేనప్పటికీ ప్రమాదంపై ఎందుకు సమీక్ష నిర్వహించకపోయారు..? ఆ రోజే ముఖ్యమంత్రి స్పందించి ధవళేశ్వం బ్యారేజీ గేట్లు మూసివేసి ఉంటే.. ఈపాటికి మృతదేహాలు అన్ని లభించి ఉండేవి కదా. ప్రమాదం జరిగిన రోజే చంద్రబాబునాయుడు గారు స్పందించారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్‌రెడ్డి చేసిందేమిటి..? ప్రమాదం జరిగిన(ది.15.09.2019) నాటి నుంచి నిన్నటి(ది.06.10.2019) వరకు ముఖ్యమంత్రి షెడ్యూల్స్‌ అని మీడియా ముందు ఉంచుతున్నాను. ఏ ఒక్క రోజూ ఆయన ఘటనపై దృష్టించలేదు. కనీసం ఆయా శాఖల మంత్రులు(ఇరిగేషన్‌, హోం, పర్యాటక శాఖలు) కూడా దీనిపై సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్న పరిస్థితి. 4 లక్షల క్యూసెక్కుల వరద ఉన్న సమయంలో బోటుకు అనుమతించడానికి వీలులేదు. కానీ 5.11 లక్షల క్యూసెక్కుల వరద ఉన్నప్పుడు బోటుకు ఏవిధంగా అనుమతించారు..?ఒక ఫోన్‌ కాల్‌ రావడంతోనే బోటుకు అనుమతిచ్చినట్లు తెలుగుదేశం నాయకులు చేసిన సర్వేలో తేలింది. 


ఆ ఫోన్‌ ఎవరి నుంచి వచ్చిందో ప్రభుత్వం బయటపెట్టాలి. ఫోన్‌ చేసి ఒత్తిడి తెచ్చిన పెద్ద మనిషిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది..? బోటులో ప్రయాణికుల సంఖ్యపై ఒక్కో మంత్రి ఒక్కో లెక్క ఎందుకు చెబుతున్నారు..? కనీసం మృతుల వివరాలు కూడా ఎందుకు బయటపెట్టడం లేదు..? మృతదేహాలు కూడా దొరకక కుటుంబసభ్యులు 11 రోజున శాస్త్రోక్తంగా కర్మకాండ నిర్వహించిన దయనీయ పరిస్థితి. వారి మనోవేదన జగన్మోహన్‌రెడ్డి గారికి అర్థం కావడం లేదా..?బోటు వెలికితీతలో ఎందుకింత నిర్లక్ష్యం..? రాష్ట్ర ప్రభుత్వానికి చేతకానప్పుడు కేంద్ర సహాయ సహకారాలు ఎందుకు తీసుకోలేకపోయారు..? విపత్తులు, ప్రమాదాల సమయంలో చంద్రబాబు గారు తీసుకున్న చర్యలలో ఒక్క శాతం కష్టపడినా ఈ పాటికి బోటును వెలికితీసి ఉండేవారు. ది.19.09.2019న విడుదల చేసిన జీవో నెం.99లో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు ఎక్కడ జరుగుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి..? ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటివరకు కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేకపోయింది. 


18.09.2019న విడుదల చేసిన జీవో నెం. 957 ప్రకారం ఎవరెవరికి పరిహారం ఇచ్చారో అయినా ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయా..? 4 గంటల పాటు భేటీ అయిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనీసం తెలంగాణకు చెందిన మృతులు, వారి వివరాల గూర్చి కనీసం మాట్లాడకపోవడం బాధాకరం. ప్రమాదంపై మీడియా చూపిన శ్రద్ధలో కాస్త కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపకపోవడం సిగ్గుచేటు. బాధితులకు న్యాయం జరగాలని హర్షకుమార్‌ గారు సుప్రీంకోర్టుకు వెళితే.. దళిత నాయకుడని కూడా లేకుండా ఆయనపై కక్షసాధింపు చర్యలా..? వైకాపా ప్రభుత్వ చర్యలతో గోదావరి జిల్లాలలో పండుగ చేసుకునే వాతావరణం లేదు. ముఖ్యమంత్రి గారు తనకు ఇష్టమైన 21 తేదీ రోజు అయినా దీనిపై స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: