ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఆ పార్టీ కేవలం ఒకే సీటు గెలుచుకోవడం, అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్న నేతలు వైసీపీ, బీజేపీల్లోకి జంప్ అయిపోతున్నారు.   ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మొదట పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఆయన బీజేపీ కండువా కప్పేసుకున్నారు.


ఆ తర్వాత నుంచి నేతలు ఎవరి దారి వారు చూసుకుంటూ పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు బీజేపీలో చేరిపోగా, మరికొందరు వైసీపీలో చేరిపోయారు. తాజాగా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న కొందరు పార్టీని వీడటం షాక్ కు గురి చేస్తుంది. ఇటీవలే జనసేన సీనియర్‌ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్‌ చైర్మన్ చింతల పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్ రాజు, పసుపులేటి సుధాకర్  తదితరులు జనసేనను వీడారు.


ఇక తాజాగా రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ జనసేనని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరి బాటలోనే విశాఖపట్నం గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య కూడా జనసేనకు గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో చేరతాని ప్రచారం జరుగుతోంది. వీరే కాక ఇంకా చాలామంది నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.


వీరిలో కొందరు వైసీపీలోకి వెళ్ళేందుకు చూస్తుంటే...మరికొందరు బీజేపీలో చేరతారని తెలుస్తోంది.అయితే ఇంతమంది పార్టీని వీడిపోతున్న అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏ మాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. పైగా ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి పవన్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒకటి చేయలేదు. ఏదో రెండు మూడు సార్లు పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించారు గానీ...జనాల్లోకి వెళ్ళి సమస్యల పై పోరాడిన సందర్భాలు లేవు.


పవన్ ఇప్పటికీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ గానే ఉన్నారని విమర్శలు నిజం చేస్తున్నారు. ఒకవైపు పార్టీకి భవిష్యత్ లేకపోవడం, మరోవైపు పవన్ పట్టించుకోకపోవడంతో జనసేన నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లో జనసేన ఖాళీ అయిపోయిన ఆశ్చర్యపడక్కర్లేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: