అవంతి శ్రీనివాస్...ఏపీ మంత్రివర్గంలో అదృష్టం కొద్దీ ఛాన్స్ కొట్టేసిన నేత. విశాఖపట్నంలో ఎంతోమంది వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నా... పార్టీ మారి వచ్చి...ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అవంతికి మంత్రి పదవి దక్కింది. అయితే 2014లో అనకాపల్లి టీడీపీ ఎంపీగా విజయం సాధించిన అవంతి...2009లో ప్రజారాజ్యం తరుపున భీమిలిలో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో...కొన్నాళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు. మొన్న ఎన్నికల ముందు వైసీపీలో చేరి మళ్ళీ భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.


ఇక విశాఖలో ఏ నేతకి దక్కని మంత్రి పదవి అవంతినే వరించింది. జగన్ అవంతికి టూరిజం, సాంస్కృతిక, యువజన క్రీడా శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్ నుంచి అవంతి హైలైట్ అయిన సందర్భం ఏదైనా ఉందంటే అది గోదావరిలో బోటు ప్రమాదం జరగడమే. బోటు ప్రమాదంలో సుమారు 50 మంది వరకు ప్రాణాలు విడిచారు. అయితే అందులో కొందరి ఆచూకీ లభ్యం కాలేదు. ఇక 26 మందిని స్థానిక జాలర్లు రక్షించారు.


ప్రమాదం జరిగిన వెంటనే పర్యాటక శాఖ మంత్రిగా అవంతి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అలాగే చనిపోయిన వారికి ప్రభుత్వం తరుపున ఎక్స్ గ్రేషియా కూడా అందేలా చేశారు. కానీ ఇన్ని రోజులైనా ఆచూకీ దొరకని వారి మృతదేహాలు లభ్యం కాకపోవడంలో, మునిగిపోయిన బోటు తీయడంలో మంత్రిగా ఫెయిల్ అయ్యారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రమాదం గురించి పక్కనబెడితే అవంతి తన శాఖకు సంబంధించి పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమి తీసుకోలేదని చెప్పాలి.


అయితే అవంతి మంత్రిగా కంటే అధికార నేతగా ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలని తిప్పికొట్టడంలో గానీ, టీడీపీపై విమర్శలు చేయడంలో గానీ దూకుడు ప్రదర్శించారు. అలాగే బోటు ప్రమాదంపై వచ్చిన విమర్శలకు సమర్ధవంతంగా కౌంటర్లు ఇచ్చారు. మొత్తం మీద అవంతి మంత్రిగా అంతగా రాణించలేకపోయిన...అధికార నేతగా అదరగొట్టారనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: