ఎన్టీఆర్ పెద్దల్లుడు, మాజీ సీఎం చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వైసీపీలో పొమ్మనలేక పొగపెడుతున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ముందు కుమారుడు హితేష్ చెంచురామ్ ని దగ్గుబాటి వైసీపీలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే హితేష్ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాడు. దీంతో జగన్ దగ్గుబాటికి టికెట్ ఇచ్చి పర్చూరు బరిలో దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచిన ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు.


దగ్గుబాటి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి దగ్గుబాటి నియోజకవర్గంలో గానీ, పార్టీలో గానీ యాక్టివ్ గా లేరు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో దగ్గుబాటికి టికెట్ ఇవ్వడంతో ఇన్ చార్జ్ రావి రామనాథంబాబు టీడీపీలో చేరిపోయారు. అయితే తాజాగా ఆయన్ని మళ్ళీ వైసీపీలోకి తిరిగి తీసుకొచ్చారు. పైగా రావిని పార్టీలోకి తీసుకురావడంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ కీలక పాత్ర పోషించారు.


ఇక ఇక్కడ నుంచి పర్చూరు రాజకీయాలు వేడెక్కాయి. నియోజకవర్గంలో రావికి, దగ్గుబాటికి అసలు పడటం లేదని తెలుస్తోంది. దగ్గుబాటి పార్టీ కార్యక్రమాలని పట్టించుకోకపోవడంతో....రామనాథం బాబే నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాలకు కూడా దగ్గుబాటి హాజరు కాలేదు.  దీంతోరావినే అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అలాగే పార్టీ శ్రేణులకు అవసరమైన పనులని పార్టీ అధిష్టానంతో మాట్లాడి చేసి పెడుతున్నారు.


అయితే నియోజకవర్గంలో రావి పెత్తనం పెరిగిపోవడంతో దగ్గుబాటి, ఆయన తనయుడు హితేష్ మంత్రి బాలినేనికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాలినేని కూడా మీరే నియోజకవర్గ ఇన్ చార్జ్, రామనాథం బాబు మీ కింద పని చేయాల్సిందే అని సర్ది చెప్పినట్లు సమాచారం. అయినా సరే దగ్గుబాటి వైఖరి పట్ల జగన్ అసంతృప్తిగానే ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే రావిని పార్టీలో మళ్ళీ తీసుకొచ్చి దగ్గుబాటికి నిదానంగా చెక్ బెడుతున్నారని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: