అవినీతి రహిత పాలన చేస్తూ.. పారదర్శకతకు పెద్ద పీట వేయాలని జగన్ సర్కార్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో చాలా కాలంగా భ్రష్ఠు పట్టిపోయిన వ్యవస్థలను ప్రక్షాళన చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ శాఖలో రిజిస్ట్రేషన్ లు.. భూ రికార్డుల్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు కన్పిస్తోంది. 


సీఎంగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి నిర్మూలన విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. పొలిటికల్‌గా మంత్రులు.. ఎమ్మెల్యేలను కట్టడి చేయడమే కాకుండా.. చాలా కాలంగా భ్రష్టుపట్టిపోయిన కొన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఏపీ సీఎం జగన్. అందులో భాగంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. 


ఆస్తుల రిజిస్ట్రేషన్లలో సంస్కరణల్లో భాగంగా స్టాంపుల శాఖ పబ్లిక్ డాటా ఎంట్రీ విధానాన్ని అమల్లోకి తేనుంది. లేఖర్ల ప్రమేయం లేకుండానే నేరుగా ఎవరైనా తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ లేదా ఇతర రిజిస్ట్రేషన్లను సులువుగా చేసుకునేందుకు వీలుగా ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలనూ అనుసంధానం చేసి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరిట ఎక్కడి నుంచైనా ఆస్తుల క్రయవిక్రయాలకు వీలు కల్పిస్తున్న ప్రభుత్వం నేరుగా కొనుగోలు, విక్రయదారులే వివరాలు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేలా ఈ విధానం అమలు కానుంది. పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ, విశాఖ నగరాల్లో తొలుత అమలు చేయాలని నిర్ణయించారు. 


ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి క్రయవిక్రయదారులే తమ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తే చాలు మిగతా అంశాల వారీగా నాలుగు పేజీల దస్తావేజు తయారవుతుంది. ముందస్తుగా నమోదు చేసిన వివరాలను అనుసరించి ఈ క్రయవిక్రయ దస్తావేజు రూపొందుతుంది. రెండు పక్షాలూ దీన్ని ఆమోదించిన అనంతరం నేరుగా సబ్ రిజిస్ట్రార్ విలువను అనుసరించి పన్ను వేసి దీన్ని ఆమోదిస్తారు. ఆన్‌లైన్ లో ఈ వివరాలను నమోదు చేయగానే వచ్చే రశీదు, ప్రింట్లతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే డిజిటల్ సిగ్నేచర్ తో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. గంట వ్యవధిలోనే దస్తావేజులు కూడా క్రయం పొందినవారికి జారీ చేయనున్నారు.


రెవెన్యూ రికార్డులను సరి చేసుకునేందుకో.. తప్పుగా నమోదైన సర్వే నెంబర్లు మార్చుకునేందుకో వచ్చే రైతులను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారనేది సర్కార్ భావన. దీంతో పూర్తి స్థాయిలో భూ సర్వే చేయాలని నిర్ణయించుకుంది. దీనికి గానూ.. కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి ప్రతి అంగుళాన్ని సర్వే చేయించాలని భావిస్తోంది. దీని కోసం సుమారు 17 కోట్ల రూపాయల అంచనాతో..  శాటిలైట్‌తో  అనుసంధానం చేస్తూ రీసర్వే చేయించనుంది ప్రభుత్వం. మొత్తంగా ఓవైపు రిజిస్ట్రేషన్ల విభాగం.. మరోవైపు భూముల రీ-సర్వే చేయించడం ద్వారా రెవెన్యూ శాఖలో వీలైనంత మేర అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని సర్కార్‌ అంచనా వేస్తున్నట్టు కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: