చైనా 70వ జాతీయ దినోత్సవానికి ముందు హాంకాంగ్‌ లో మళ్లీ ఉద్రిక్తలు చెలరేగాయి. నేరగాళ్లను చైనాకు అప్పగించే బిల్లును హాంకాంగ్ పౌరులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై నాలుగు నెలలుగా సాగుతున్న నిరసనలు తీవ్రంగా మారాయి. దీనీకితోడు మాస్కులతో నిరసనల్లో పాల్గొనకూడదనే పాత చట్టం తెరపైకి తీసుకురావటంతో మరింత మండిపడుతున్నారు హాంకాంగ్ ఆందోళనకారులు.  


హాంకాంగ్ నగరంలో నిరసనలు ఉధృతమయ్యాయి. అక్కడ  నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను విచారణ కోసం  చైనాకు అప్పగించాలనే ప్రతిపాదనలపై హాంకాంగ్ పౌరులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కొద్ది నెలల నుంచి హాంగ్‌ కాంగ్‌ లో నిరసనలు ఉధృతమయ్యాయి. నెలల తరబడి కొనసాగిస్తున్న నిరసనలను అడ్డుకునేందుకు హాంకాంగ్ సీఈఓ  క్యారీలామ్ సిద్ధమయ్యారు. ఇందుకోసం బ్రిటిష్ వలస పాలన హయాం నాటి అత్యవసర అధికారాల చట్టం తెరపైకి తెచ్చారు. మాస్కులు ధరించి నిరసనల్లో పాల్గొనటం ఈ చట్ట  ప్రకారం నిషేధం. హాంకాంగ్ లో 52ఏళ్ల తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయడం ఇదే మొదటి సారి. మాస్క్ లు ధరించిన నిరసనకారులు, అల్లర్లకు పాల్పడే వారికి వ్యతిరేకంగా పోలీసులు చర్యలు చేపట్టేందుకు ఈ ఎత్తు వేశారు.


అయితే పాత చట్టాన్ని తిరగతోడటంతో హాంకాంగ్ ఆందోళనలతో అట్టుడికింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. రెండు రోజుల క్రితం పోలీసులు జరిపిన కాల్పుల్లో, 14 ఏళ్ల బాలుడు చనిపోవడంతో హాంకాంగ్ అగ్నిగుండమయింది. నిరసనకారులు ముఖాలకు మాస్కులు ధరించి పెద్దఎత్తున వీధుల్లో ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. భాష్పవాయువు, వాటర్ కెనన్లు ప్రయోగించారు. అటు ఆందోళనకారులు కూడా పెట్రోలు బాంబులతో తిరగబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. 


ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో సహా హాంకాంగ్ లోని అన్నీ రైలు సర్వీసులు నిలిపివేశారు. ఘర్షణల సమయంలో సబ్ వే స్టేషన్లు ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది. సగం సబ్వే స్టేషన్లు మూసి ఉన్నప్పటికీ, వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. పెద్ద సంఖ్యలో భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా, విక్టోరియా హార్బర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. మరోవైపు, ముఖాలకు ముసుగులు ధరించటాన్ని నిషేధించటాన్ని సవాల్ చేస్తూ ప్రజాస్వామ్య అనుకూల చట్టసభ సభ్యులు ఈ ఆదివారం ఉదయం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిషేధం చట్టసభ అధికారాలను హరించడమేనని, నగర మినీ-రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని వాదించారు. కానీ, ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మరోపక్క ఈ మంగళవారం రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ జాతీయ దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున మిలిటరీ పరేడ్ నిర్వహించేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు హాంకాంగ్ నిరసనకారులకు మద్దతు తెలుపుతూ సిడ్నీ, తైపీ నగరాల్లోని ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చి పలు ప్రదర్శనలు చేపట్టారు. చైనా నిరంకుశత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. హాంకాంగ్ ను కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: