కేరళలో వరుస హత్యలు కలకలం రేపాయి. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల్ని.. ఆ కుటుంబానికి చెందిన కోడలే అంతం చేసిందని తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఆస్తి కోసం ఇంత దారుణానికి ఒడిగట్టిన కోడలు.. అందర్నీ ఆహారంలో పాయిజన్ కలిపే చంపేసిందని తేలింది. 


కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో పున్నమట్టోంది ఒక సంపన్న కుటుంబం. 2002 నుంచి 2016 వరకూ ఆ ఇంటికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఒకే రీతిలో హఠాన్మరణానికి గురయ్యారు. కానీ వాస్తవం 17 ఏళ్లపాటు సమాధి అయిపోయింది. సమాధుల్లోంచి నిజం బయటికొచ్చింది. ఇంటి కోడలే హంతకురాలని తేలింది. ఇంటి కోడలు జాలీ.. రెండో భర్తతో కలిసి ఈ దారుణాలన్నీ చేసింది. జాలీ ఓ ఆభరణాల సంస్థలో పనిచేసే మాథ్యూ అనే వ్యక్తి సాయంతో సైనేడ్‌ తెప్పించి ఆహారపదార్థాల్లో కలిపి కుటుంబసభ్యులను ఒక్కొక్కరిగా 14 ఏళ్ల వ్యవధిలో చంపేసింది. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన జాలీ, మాథ్యూ, సైనేడ్‌ సరఫరా చేసిన ప్రజిత్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు.


జాలీ తొలి లక్ష్యం జాలీ అత్త అన్నమ్మథామస్‌. ఆ తర్వాత మామ టామ్‌థామస్‌. ఇద్దరికీ ఆహారంలో సైనైడ్ కలిపే చంపేసింది. తనతో సరిగా ఉండని భర్త రాయ్‌పై పీకలదాకా ద్వేషం పెంచుకుని, తర్వాతి లక్ష్యంగా ఆయనను ఎంచుకుంది. శవపరీక్షలో అతడి మృతికి విషం కారణమని తేలినప్పటికీ భర్తకు గుండెపోటు వచ్చినట్లు జాలీ వాదించింది. శవపరీక్ష కోసం పట్టుబట్టిన అన్నమ్మ సోదరుడు మాథ్యూ మన్‌జదియల్‌పై ద్వేషం పెంచుకుంది. అతడిని కూడా చంపేసింది. అక్కడితో మరణాల పరంపర ఆగలేదు. మామగారి సోదరుడి కుమారుడైన షాజూ రెండేళ్ల కుమార్తె ఆల్పైన్‌ కూడా జాలీ దురాగతానికి బలైపోయింది. చిన్నారి తల్లిని కూడా వదల్లేదు నిందితురాలు. ఈ మధ్యలో ఆడపడుచు రెజీకి ఓ ఆయుర్వేద టానిక్‌లో విషపదార్థం కలిపి ఇచ్చినప్పటికీ ఆమె అస్వస్థతకు గురైనా ఎలాగో బతికిపోయారు. విషయం బయటకు వస్తే కుటుంబం పరువుపోతుందని తాను ఎవరికీ చెప్పలేదని రెజీ ఇప్పుడు వెల్లడించారు. కుమార్తె చేసిన ఈ ఘాతుకాల గురించి తమకేమీ తెలియదని జాలీ తలిదండ్రులు చెబుతున్నారు. 


ఆరుగురిని హత్య చేసిన తర్వాత జాలీ.. షాజూను పెళ్లి చేసుకుంది. అతడు జాలీ మామ సోదరుడి కుమారుడే. మామగారైన థామస్‌ వీలునామా ప్రకారం ఆస్తిని తనకు అప్పగించాలని జాలీ వాదన మొదలు పెట్టింది. దీంతో అమెరికాలో ఉన్న థామస్‌ రెండోకుమారుడు మోజోకు అనుమానం వచ్చింది. ఆస్తికోరుతూ వదిన వేసిన వ్యాజ్యాన్ని సవాలు చేశారు. కుటుంబంలో మరణాల వెనక ఏదో మిస్టరీ ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరాతీస్తే తీగలాగితే డొంక కదిలినట్లు వాస్తవం వెలుగుచూసింది.  




మరింత సమాచారం తెలుసుకోండి: