దసరా పండుగ అంటే ఎన్నో వూసులు గుర్తుకువస్తాయి. ఇదివరకు  పాఠశాల‌ల్లో పిల్లలను తీసుకుని  ఉపాధ్యాయులు ఇంటింటికీ దసరా రోజు వచ్చి అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ పాటలు పాడేవారు. పిల్లలు సైతం పూల బాణాలు పట్టుకుని వాటిని ప్రతి ఇంటి వద్ద ప్రయోగించేవారు. వారు నేర్చుకున్న పద్యాలను అప్పచెబుతూ ఉంటే తల్లిదండ్రులు సంతోషించి అయ్యవార్లకు మరింత ఎక్కువగా కానుకలు ఇచ్చి పంపించేవారు.


దసరా అంటేనే మంచి కోసం పోరాటం. దాన్ని చిన్నప్పటి నుంచి బోధించేవి నాటి చదువులు. అంతకు ముందు గురుకులాలు అయినా, లేకపోతే తరువాత వచ్చిన అచ్చమైన మన ప్రభుత్వ పాఠశాలలు అయినా దసరా ముచ్చట్లు చెబుతూ పిల్లలకు భవిష్యత్తు గుర్తు చేసేవారు. వారు మంచి కోసం పాటుపడాలని చిన్ననాటి నుంచే గట్టిగా చెప్పేవారు.


ఇపుడు ఇంగ్లీష్ మీడియం చదువులు, పైగా ప్రైవేట్ చదువులు, దసరా పద్యాలు లేవు. తెలుగు అంతకంటే లేదు. అందువల్ల దసరా వూసులు ఎవరికీ అక్కరలేదు. పండుగ అంటే ఆ రోజు కూడా టీవీలకు అతుక్కుపోవడమో, లేక సినిమాలు షికార్లు చేయడమో విందు భోజనాలు ఆరగించడమో తప్ప మన కల్చర్ గురించి చెప్పే వారు లేరు, వినే వారు అంతకంటే లేరు. దసరా సరదాలు అంటే ఆనాటివేనని అంతా చెబుతారు.


ఇపుడు దసరా వచ్చిందంటే సినిమా హాళ్ళు రష్ గా కనిపిస్తున్నాయి, పార్కులు రద్దీగా ఉంటున్నాయి. ఏ సమాజానికైనా ఉత్తమమైన గురువు ఉంటే మంచి శిష్యుడు వస్తాడు. దసరా వేడుకల వెనక గురు శిష్యుల మధ్య అనుబంధం దాగుంది. మళ్ళీ అలాంటి రోజులు వస్తాయా...దసరా అంటే సార్దకత కలిగించే కాలం వస్తుందా.. ఏమో. వేచి చూడాలి మరి అంతా.



మరింత సమాచారం తెలుసుకోండి: