తెలంగాణ సీఎం కేసీఆర్ రాజరికపు పోకడలతో, నియంతలా ప్రవర్తిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి నిజాం మహారాజు అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.


ఆయన ఏమన్నారంటే..

“ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ఇష్టం లేదు అంటూనే పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నట్లుగా ఉన్నది. మూడు వేల ఒక వంద బస్సులను తీసుకుని నడపాలని నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. మరో రెండు వేల ఒక వంద బస్సులు పూర్తిగా ప్రైవేటు అని పల్లె వెలుగు లాగా తీసుకుంటామని ముఖ్యమంత్రి దురాలోచన కు అద్దం పడుతున్నది. ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో 1200 మంది మాత్రమే అని పేర్కొనడం సహించరానిది. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత సమ్మె చేసే అధికారం హక్కు గుర్తింపు పొందిన యూనియన్లకు ఉంది .


గుర్తింపు పొందిన యూనియన్ లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఉద్యోగులుగా పరిగణించడం లేదని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు ప్రభుత్వ అనుమతితోనే చేయాలనే విధంగా నిర్ణయించడం సరైంది కాదు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని అంటూనే భవిష్యత్తులో యూనియన్ల ప్రసక్తే ఉండదని మాట్లాడడం నిరంకుశ వైఖరికి అద్దం పడుతున్నది. భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమే.రాష్ట్రంలో ఎస్మా ప్రయోగించే అవకాశాలు లేకున్నా ఆర్టీసీ కార్మికుల పైన ఎస్మా ప్రయోగించాలని ఉద్యోగులను తీసివేశామని మాట్లాడడం సరైంది కాదు. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు అని పేర్కొనడం నీతి బాహ్యమైన చర్య. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు చేసినటువంటి ఉద్యమాన్ని స్వాగతించారు. అదే విధంగా నేడు కార్మికులు చేస్తున్న సమ్మె ను స్వాగతిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు.


నవరాత్రి ఉత్సవాలలో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి రాజరిక పోకడలతో రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి కి శ్రేయస్కరము, శుభకరం కాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి తను ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.. అంటున్నారు లక్ష్మణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: