వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపికయిన వారికి నియామక ఉత్తర్వులు, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రాత పరీక్షల్లో అర్హత మార్కులను తగ్గించారు. 
 
పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు సరిపోయే విధంగా ఆ రాత పరీక్షల్లో కనీస మార్కులు తెచ్చుకోలేని జిల్లాల్లో అర్హత మార్కులను తగ్గించి పోస్టులను భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరిల్లో పోస్టులు పూర్తిగా భర్తీ కాని వాటికి కనీస అర్హత మార్కులు తగ్గించి నియమించటం కొరకు జిల్లా ఎంపిక కమిటీలు కలెక్టర్ల నేతృత్వంలో చర్యలు చేపట్టాయి. 
 
సచివాలయ రాత పరీక్షలకు ఓసీలకు 60 మార్కులు, బీసీలకు 52.50, ఎస్సీ, ఎస్టీలకు 45 మార్కులను కనీస అర్హత మార్కులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. చాలా జిల్లాల్లో తగినంత మంది కనీస అర్హత మార్కులు తెచ్చుకున్నవారు లేకపోవటంతో పోస్టులు మిగిలిపోయాయి. వైసీపీ ప్రభుత్వం 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
శనివారం రోజు వరకు 1,01,454 మందికి జిల్లా ఎంపిక కమిటీల నుండి కాల్ లెటర్లు అందినట్లు తెలుస్తోంది. అధికారులు కొన్ని జిల్లాల్లో బీసీ, జనరల్ కేటరిల్లో కూడా వివిధ రకాల ఉద్యోగాలు మిగిలిపోయాయని చెబుతున్నారు. అక్టోబర్ 15వ తేదీన జిల్లాల వారీగా మిగిలిపోయిన బీసీ, జనరల్ కేటగిరీ పోస్టుల వివరాలను అధికారులు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. ఆ తరువాత జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థుల అర్హత మార్కుల తగ్గింపు గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: