ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని తెగేసి చెప్పిన కెసిఆర్ ఆర్టీసీకి జవసత్వాలు నింపేదుకు కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించారు.  ఇప్పటి వరకు ఆర్టీసీలో 10,200 బస్సులు ఉన్నాయి.  అందులో 50% బస్సులు పూర్తిగా ఆర్టీసీకి చెందినవి కాగా, మరో 30% బస్సులు ఆర్టీసీ యాజమాన్యానికి చెందిన బస్సులు.  మరో 20 శాతం బస్సులు పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన బస్సులు. 

అయితే, ఈ 20శాతం బస్సులకు ప్రైవేట్ స్టేజి కారేజీ ఇవ్వబోతున్నారు.  ఫలితంగా వీటిని గ్రామాల్లోను, పట్టణాల్లోను నడిపేందుకు వీలౌతుంది.  ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం లేదని, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతోనే ఆర్టీసీని నడపబోతున్నట్టు చెప్పారు.  యూనియన్ల వలనే ఆర్టీసీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుందని, గత 40 ఏళ్లుగా ఆర్టీసీ యూనియన్లు చేసిన పనులను పరిశీలించినట్టు కెసిఆర్ చెప్పారు.  


కూర్చున్న చెట్టును యూనియన్లు నరుక్కున్నాయని, ఇకపై యూనియన్లకు ఆర్టీసీలో స్థానం లేదని, అలాంటి వ్యవస్థలు ఉండబోవని అన్నారు.  యూనియన్లు లేకుండానే ఆర్టీసీని నడుపుతామని కెసిఆర్ అంటున్నారు.  అది సాధ్యం అయ్యేపనేనా అన్నది చూడాలి.  ఆర్టీసీని త్వరలోనే లాభాలబాటలోకి తీసుకొస్తామని, ఉద్యోగంలో కొత్తగా చేరబోయే కార్మికులకు బోనస్ ఇచ్చే స్థితికి ఆర్టీసీ రావాలని, దాన్ని తీసుకొస్తామని కెసిఆర్ చెప్పుకొచ్చారు.  


ఇంతవరకు బాగానే ఉంది.. అయితే, ఇదంతా జరుగుతుందా అన్నది అందరి డౌట్.  ఎందుకంటే ఏకంగా 48,600 మందిని ప్రభుత్వం విధులనుంచి తొలగించినట్టు చెప్పింది.  వీరంతా ఇకపై ఆర్టీసీ కార్మికులు కారని చెప్పింది.  గతంలో తమిళనాడులో కూడా జయలలిత ఇలానే చేసింది.  లక్షా 70వేలమంది ఉద్యోగులను తొలగించింది.  దీంతో వారంతా కోర్టుకు వెళ్లారు. కోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.  ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జయలలిత  పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది.  ప్రభుత్వం బెదిరించే బెదిరింపులకు బెదిరిపోమని కార్మిక సంఘాలు అంటున్నాయి.  ఉద్యోగులు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు తమ పోరాటం ఆగదని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: