తెలంగాణ రాష్ట్ర పోలీసులు రాష్ట్రంలోని మహిళల భద్రత కొరకు సరికొత్త ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. క్యాబ్ లో ప్రయాణం చేసే పౌరుల, మహిళల భద్రత కోసం క్యాబ్ సర్వీసులను పోలీసుల ప్యాట్రోల్ వాహనాలతో అనుసంధానం చేశారు. డిజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టామని చెప్పారు. నేర రహిత సమాజంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చటం కొరకు ఈ ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. 
 
ఎవరైనా క్యాబ్ లలో ప్రయాణించే సమయంలో ఆపదలు ఎదురైనా, ఏవైనా ప్రమాదాల్లో చిక్కుకున్నా ఓలా, రైడో, హాక్ ఐ, ఎం వాలెట్ అప్లికేషన్లలో ఉన్న ఎస్ ఓ ఎస్ (ఎమర్జెన్సీ) బటన్ ను ప్రెస్ చేస్తే వెంటనే సమాచారం అంతా మహిళ బంధువులకు, డీసీపీ, ప్యాట్రోల్ వాహనాలకు అందుతుంది. క్యాబ్ డ్రైవర్ యొక్క వివరాలు, క్యాబ్ లొకేషన్, క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్ మరియు ఇతర వివరాలు పోలీసులకు వెంటనే చేరుతాయి. 
 
జీపీస్ ఆధారంగా సమీపంలో ఉన్న ప్యాట్రోల్ వాహనాలు మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఒక ప్రత్యేకమైన బృందం 24 గంటల పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సేవల కొరకు పని చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రయాణించే వారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి రాబోతున్నాయని తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన క్యాబ్ సంస్థలు కూడా ఈ విధానంలో చేరాలని పోలీసులు కోరుతున్నారు. హాక్ ఐ యాప్ మీద పౌరుల్లో మరియు మహిళల్లో అవగాహన పెరుగుతుందని అన్నారు. 22 లక్షల మంది ఇప్పటివరకు హాక్ ఐ యాప్ ఉపయోగిస్తున్నారని డీజీపీ తెలిపారు. బాధితులకు ప్రక్రియ ముగిసిన తరువాత సర్వే ప్రతినిధులు ఫోన్ చేసి ఎవరు ఎలా పని చేశారో తెలుసుకొని సేవలను మరింతగా మెరుగు పరుచుకుంటారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: