టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మనీ లాండరింగ్, ఆర్థిక నేరగాళ్ల జాబితాలో రవిప్రకాష్ పేరు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కు లేఖ రాశారు. ఐటీ, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను రవిప్రకాష్ ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. 
 
ఉగాండా, కెన్యాలో రవిప్రకాష్ పెట్టుబడులు పెట్టారని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. రవిప్రకాష్ కొన్ని సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలు మరియు రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల వివరాలను విజయసాయిరెడ్డి లేఖలో జత చేశారని తెలుస్తోంది. విదేశీ చిరునామాలతో రవిప్రకాష్ బ్యాంకు ఖాతాలను తెరిచారని కూడా పేర్కొన్నారు. రవిప్రకాష్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. 
 
ఇప్పటివరకు టీవీ9 లో చేసిన అక్రమాల గురించి మాత్రమే రవిప్రకాష్ పై కేసులు ఉన్నాయి. బ్యాంకులను అంతర్జాతీయ స్థాయిలో మోసం చేసిన మొయిన్ కురేషి అనే వ్యక్తితో పాటు సీబీఐ కేసులో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న సానా సతీష్ అనే వ్యక్తితో కలిసి రవిప్రకాష్ చాలా మంది వ్యక్తులను మోసం చేశారని తెలుస్తోంది. ప్రముఖ నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను ముగ్గురూ కలిసి బెదిరించి హవాలాకు పాల్పడ్డారని తెలుస్తోంది. 
 
రవిప్రకాష్ పై గతంలో టీవీ9 సంస్థలో ఫోర్జరీ, షేర్ల లావాదేవీలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. రవిప్రకాష్ పై టీవీ9 సంస్థలో 18.31 కోట్ల రూపాయలు స్వాహా చేసిన కేసు నమోదు కావటంతో ప్రస్తుతం రవిప్రకాష్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. జైలు అధికారులు రవిప్రకాష్ కు ఖైదీ నెంబర్ 4412 ను కేటాయించారు. విజయసాయిరెడ్డి లేఖను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని రవిప్రకాష్ పై విచారణ మొదలైతే మాత్రం రవిప్రకాష్ కు మరిన్ని కష్టాలు తప్పవు. 




మరింత సమాచారం తెలుసుకోండి: