ఆరేకాల‌నీ...ముంబైలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఇప్పుడు మార్మోమోగిపోతోంది. రాజకీయాలు, సెల‌బ్రిటీల‌కు సంబంధం లేకుండా అంతా ఈ పేరును ప్ర‌స్తావిస్తున్నారు. నిన‌దిస్తున్నారు. ఎందుకు ఇంత క్రేజ్ అనే విష‌యం వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణాలు. ఆరే కాల‌నీకి ముంబై మహానగరానికి పర్యావరణ ఊపిరితిత్తులుగా పేరుంది. అందుకే, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు, పర్యావరణ కార్యకర్తలు పెద్దయెత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఉద్యమానికి పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు సైతం మద్దతు ప్రకటించారు.


ముంబై శివారులోని గోరెగావ్‌లో ఉన్న 12 గ్రామాల సమాహారం. సుమారు 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. ముంబైలో క్షీర విప్లవానికి నాంది పలుకుతూ 1949లో దారా ఖురోడీ నేతృత్వంలో ఈ కాలనీ రూపుదిద్దుకుంది. 1951లో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆరే కాలనీలో డెయిరీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ సుమారు 32 పశు క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో 16వేలకు పైగా పశువులున్నాయి. ప్రతి రెండేళ్ల‌కు వీటి నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేట్ కంపెనీకి ఔట్ సోర్సింగ్‌కు ఇస్తారు. నాణ్యమైన పశుగ్రాసం, గడ్డిని ఇక్కడ భారీగా సాగుచేస్తున్నారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ తర్వాత నగరంలో అత్యధిక పచ్చదనం విస్తరించిన ప్రాంతం ఇదే. ఇక్కడి `చోటా కశ్మీర్` సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ. కాలనీలో తోటలు, నర్సరీ, సరస్సులు, పర్యాటక కేంద్రాలు, మిల్క్ ప్లాంట్లు ఉన్నాయి. 1977లో ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు ఈ కాలనీ నుంచి 490 ఎకరాలను సేకరించారు. సంస్థల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత స్థలాన్ని లీజుకిచ్చారు. ఇంత‌టి ప్రత్యేక‌మైన ప్రాంతానికి బీజం వేసి దారా ఖురోడీ 1963లో డాక్టర్ వర్గీస్ కురియన్‌తో కలిసి రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నారు. 


అయితే, తాజాగా ముంబై మెట్రో లైన్-3లో భాగంగా కార్‌షెడ్ నిర్మాణానికి ఇక్కడి అటవీ స్థలాన్ని ధ్వంసం చేస్తుండడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరే కాలనీలో గ‌త శుక్రవారం రాత్రి ప్రారంభమైన చెట్ల నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద్దంటూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలను శనివారం కూడా కొనసాగించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు 29 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో 29 మందిని అరెస్టు చేయ‌గా...ఇందులో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.


కాగా, మెట్రో నిర్ణయాన్ని నిరసిస్తూ నలుగురు పర్యావరణవేత్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆరే కాలనీ అటవీ ప్రాంతం కాదని సదరు పిటిషన్లను శుక్రవారం కోర్టు కొట్టేసింది. దీంతో, చెట్ల నరికివేత చర్యలను కనీసం వారం రోజుల పాటు నిలిపివేయాల్సిందిగా మరికొందరు పర్యావరణ కార్యకర్తలు ముంబై హైకోర్టులో శనివారం మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే, శుక్రవారం ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని, చెట్ల నరికివేతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిలిపివేయమని తాము చెప్పలేమని కోర్టు పేర్కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: