మామూలుగా మంత్రులు వారసులు అంటే వాళ్లే పెద్ద మంత్రులుగా ఫీల్ అయిపోతారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేయడంలో ముందుంటారు. పలు వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో అధికారాన్ని అనుకూలంగా మలుచుకుని డబ్బు సంపాదిస్తుంటారు. నచ్చిన వాళ్ళకి పదవులు ఇప్పించుకుంటారు. అన్ని పనుల్లోనూ కావాల్సిన వారికి సిఫారుసులు చేస్తుంటారు. ఇలాంటి వారసులకు ఏపీలో కొదవ లేదని చెప్పాలి. ఇలాంటివారికి రాష్ట్రంలో చాలా ఉదాహరణలు చూశాం కూడా. గత టీడీపీ ప్రభుత్వంలో అయితే మంత్రులు వారసులు ఏం చేశారో అందరం చూశాం.


ముఖ్యంగా దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు చేసిన పనులు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనయుడు చేసిన పనులు వల్లే కోడెల పరువుపోయి...ఆత్మహత్య చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి రాజకీయ వారసులు ఉన్న ఏపీలో...ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఓ మంత్రి తనయుడు మాత్రం వీటిన్నటికి విరుద్ధంగా ఉన్నారు. తండ్రి అధికారంతో ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళుతున్నారు. తండ్రి మంత్రి అనే గర్వాన్ని ఏ మాత్రం తలకెక్కించుకోకుండా సామాన్యుడిలా వ్యవహరిస్తూ, సామాన్యుల సమస్యలని పరిష్కరిస్తున్నారు.


ప్రతి రోజు తన దృష్టికొచ్చిన ఏ సమస్యని పక్కనబెట్టకుండా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇంతలా సేవలు చేస్తున్న యువనాయకుడు ఎవరో కాదో...మచిలీపట్నం ఎమ్మెల్యే, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తనయుడు పేర్ని కృష్ణమూర్తి. అయితే ఇక్కడో విశేషం ఏమిటంటే మంత్రి నాని...తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి పేరునే....తనయుడుకి పెట్టుకున్నారు. నాని తండ్రి కృష్ణమూర్తి కూడా కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు.


మచిలీపట్నం రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకుని ప్రజలకు సేవ చేసిన కృష్ణమూర్తి వారసుడుగా.. నాని కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక నాని తనయుడు కృష్ణమూర్తి కూడా ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు. ఇది సమస్య అని చెబితే చాలు చిటికెలో పరిష్కారం చేసి చూపిస్తున్నారు. గత నాలుగు నెలల కాలంలో నియోజకవర్గానికి సంబంధించి తన దృష్టికొచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించారు.


ముఖ్యంగా ఆయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ...నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, దోమలు, డంపింగ్ యార్డ్ ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పెట్టి ప్రజల మన్ననలని పొందుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న తనయులకు బుద్ధి చెప్పేలా వారసుడు అంటే ఇలా ఉండాలని అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మొత్తానికి ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనే పదానికి వన్నె తెస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: