అధికారం లేకపోతే ఎలా ఉంటుందో ఏపీలో టీడీపీ పరిస్తితిని చూస్తే అర్ధమైపోతుంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులతో కళకళాడిపోయింది. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి వెలవెలబోతుంది. వరుసగా నాయకులు పార్టీని వీడుతూ టీడీపీకి షాకులు మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీని వీడి బీజేపీ, వైసీపీల్లో చేరిపోయారు. ఇంకా ఆ వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.


అసలు జూపూడి వైఎస్ కుటుంబానికి విధేయుడు అన్న విషయం తెలిసిందే. వైఎస్ మరణం తర్వాత జూపూడి కాంగ్రెస్ ని వీడి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే సొంత నేతల వల్లే ఓడిపోయానని భావించి అధికారంలో ఉన్న టీడీపీలో చేరిపోయారు. ఆయనకు చంద్రబాబు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అయితే తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పైగా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్న జూపూడి హఠాత్తుగా వైసీపీలో చేరిపోయారు.


అయితే జూపూడి లాగానే 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిన వైసీపీ నేతలు కొందరు త్వరలోనే దుకాణం సర్దేసేలా కనిపిస్తున్నారు. అప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. మొన్న ఎన్నికల్లో ఈ 23 మందిలో ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప మిగతా వారంతా ఓటమి పాలయ్యారు. కాకపోతే ఎన్నికల ముందే మణిగాంధి, ఎస్వీ మోహన్ రెడ్డి లాంటి నేతలు వైసీపీలో చేరిపోయారు. ఇక ఎన్నికల ఓడిపోయిన తర్వాత ఈ జంపింగ్ క్యాండిడేట్లు సైలెంట్ అయిపోయారు.


అందులో కొందరు మళ్ళీ తిరిగి సొంతగూటికి చేరుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు జంప్ అయిపోవడానికి చూస్తున్నారు. ఇక ఇందులో మరికొందరు బీజేపీలో చేరడానికి చూస్తున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరుతున్నాని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, జ్యోతుల నెహ్రూ లాంటి వారు తిరిగి వైసీపీలోకి వెళ్ళేందుకు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కూడా వైసీపీలో చేరిపోతారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జంపింగ్ నేతలు మళ్ళీ దుకాణం సర్దేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: