పాక్ మాటల్లోని డొల్లతనం మరోసారి బయటపడింది. హిందన్ వైమానిక స్థావరంలో భారత వైమానికి దళం నిర్వహించిన ఆర్మీడే విన్యాసాల్లో అది వెలుగుచూసింది. బాలాకోట్ దాడుల తర్వాతి రోజు ఏ సుఖోయ్ విమానాన్ని కూల్చామని పాక్ ప్రకటించిందో.. అదే విమానం ఇప్పుడు విన్యాసాలు చేసింది. దీంతో పాక్ అబద్ధం చెప్పిందని తేలిపోయింది. 


యూపీ ఘజియాబాద్ హిందన్ వైమానిక స్థావరంలో ఆర్మీడే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. గగనతల విన్యాసాల్లో పాల్గొన్న రెండు సుఖోయ్-30 ఎంకేఐలలో ఒకటైన ఎవెంజర్ 1 విమానాన్నే.. పాకిస్థాన్ గత ఫిబ్రవరి 27న కూల్చేసినట్టు ప్రకటించింది. ఏదైతే తాము కూల్చేశామని పాక్ చెప్పుకుందో అదే ఎవెంజర్ 1.. వాయుసేన విన్యాసాల్లో స్వైరవిహారం చేసింది. ఫిబ్రవరి 27న ఏ ఇద్దరు సిబ్బంది విమానాన్ని నడిపారో.. ఇప్పుడు కూడా వారే విన్యాసాలు చేశారు. దీంతో పాక్ అబద్ధాలు బట్టబయలయ్యాయి. 


గత ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడులకు ప్రతిగా.. తర్వాతి రోజే భారత్ పై పాకిస్థాన్  వైమానిక దాడులకు ప్రయత్నించింది. వీటిని మన వాయుసేన బలంగా తిప్పికొట్టింది. ఎఫ్-16తో పాక్ దాడికి దిగినప్పుడు దానిని మిగ్-21 బైసన్‌తో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూల్చేశాడు. అయితే ఎఫ్-16 కూలిపోలేదంటూ బుకాయించిన పాక్ తమ వాదనకు బలం చేకూరేందుకు తామే స్వయంగా సుఖోయ్-30ఎంకేఐని కూల్చేశామని వాదన చేసింది. ఆ తర్వాత మిగ్-21 బైసన్ పీఓకేలో కూలిపోవడం, పట్టుబడిన అభినందన్‌ను దౌత్య ఒత్తిడికి తలొగ్గి పాక్ తిరిగి భారత్‌కు అప్పగించడం జరిగింది. ఇప్పుడు పాక్ కూల్చేశామని చెప్పుకున్న సుఖోయ్ కూడా విన్యాసాలు చేయడంతో.. దాయాది దేశానికి షాకిచ్చినట్టైంది. వీర్ చక్ర విజేత అభినందన్ వర్థమాన్.. స్వయంగా మిగ్ -21 బైసన్ ను నడిపి అందరి హృదయాల్ని దోచుకున్నాడు. తన దైర్య సాహసాలను ప్రదర్శించి ఔరా అనిపించుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: