ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఊహించ‌ని షాక్ ఎదురైంది. భర్త భార్గవ రామ్‌పై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అదే రీతిలో మరో కేసు నమోదైంది. తాజాగా ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్సై రమేశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అరెస్టు చేసే క్ర‌మంలో ఊహించ‌ని ట్విస్ట్  చోటుచేసుకుంది. 


భార్గ‌వ్‌రామ్‌కు కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డితో వ్యాపార భాగ‌స్వామ్యం ఉంది. శివ‌రామిరెడ్డికి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40 శాతం వాటా ఉంది. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో భేదాభిప్రాయాలు రావడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న భార్గవ రామ్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారు. 


అయితే, గచ్చిబౌలిలో పోలీసుల కారు చూసిన భార్గవ రామ్‌ అక్కడ కారు ఆపినట్లే ఆపి అక్కడి నుంచి పారిపోయాడు. కారును వెంబడించి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపైకి దూసుకెళ్లాడు. సోమవారం సాయంత్రం తన కారును భార్గవ స్వయంగా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తమ విధులకు ఆటంకం కల్గించడంతో పాటు కారుతో ఢీకొట్టేందుకు యత్నించాడని ఎస్సై రమేశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు ఐపీసీ 353, 336 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్ప‌టికే అఖిలప్రియ, భార్గవ్‌ రామ్‌ల పీఏ మహేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్న భూమా అఖిలప్రియ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: