యురేనియం తవ్వకాలు నిలిపేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా.. డ్రిల్లింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఏపీలో నెల్లూరు, తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో యురేనియం అన్వేషణ జరుగుతోంది. జలాశయాల సమీపంలో డ్రిల్లింగ్ చేయడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. 


నెల్లూరు జిల్లాలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం తీవ్రంగా అన్వేషణ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆటోమెటిక్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున యంత్రాలు, పరికరాలను అక్కడికి తీసుకొని వచ్చి తవ్వకాలు జరుపుతున్న అన్వేషణ కొనసాగిస్తున్నారు. అయితే ఓ చోట యురేనియం గుర్తించి నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించినట్లు సమాచారం.


ఇదిలా ఉంటే తవ్వకాలు జరుపుతున్న చోటకు అతి దగ్గరలో సోమశిల జలాశయం ఉందని యురేనియం తవ్వకాలు ద్వారా నీరు కలుషితమై తమ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటాయని తద్వారా తాము ఉపాధి కోల్పోతాము అంటూ స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఓ పక్క నల్లమలలో యురేనియం వెలికితీతపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేఖత వచ్చి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో యురేనియం కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా లిమిటెడ్‌‌ డ్రిల్లింగ్‌‌ చేస్తూ శాంపుల్స్‌‌ సేకరించడం వివాదస్పదమవుతోంది.  ఆత్మకూరు మండలం  మస్తీపూర్‌‌ చుట్టూ ఏడు చదరపు  కిలో మీటర్ల పరిధిలో  నాలుగు బ్లాకులలో యురేనియం సర్వే, వెలికితీతకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. 


అయితే గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వివిధ ప్రాంతాల్లో వేల ఫీట్ల లోతులో డ్రిల్లింగ్ చేపట్టి శ్యాంపిల్స్ సేకరించిన యూసిఐఎల్ సిబ్బంది  ఇక్కడ సుమారు 23  మిలియన్‌‌ టన్నుల ముడి ఖనిజం ఉన్నట్లు  ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇక్కడి శ్యాంపిల్స్ పై రిపోర్టులు వచ్చిన తరువాత తవ్వకాల విషయంలో క్లారిటి రానుంది. ఇదిలా ఉంటే జూరాల అతి సమీప ప్రాంతం, ఆయకట్టు  ప్రాంతమైన ఇక్కడ తవ్వకాలపై  స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: