మూకదాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భారత్ లో అందరూ కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు. దసరా సందర్భంగా నాగ్ పూర్ లో ఆర్.ఎస్.ఎస్ సమావేశంలో పాల్గొన్న భగవత్.. ఆయుధపూజ నిర్వహించారు. భిన్నత్వమే దేశానికి అంతర్గత శక్తి అని గుర్తుచేశారు భగవత్. 


మూకదాడులు పాశ్చాత్య సంస్కృతి అని.. వీటితో దేశ ప్రతిష్ఠ దిగజార్చొద్దని ఆర్.ఎస్.ఎస్  చీఫ్ మోహన్ భగవత్ కోరారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. నాగ్‌పూర్‌లో దసరా సందర్భంగా ఆర్.ఎస్.ఎస్  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతిని, భారత్ ఆచారాలకు విరుద్ధమని తేల్చిచెప్పారు మోహన్ భగవత్. 


ఇటీవల కాలంలో భారతీయత అనే సిద్ధాంతంపై ప్రజల ఆలోచనా ధోరణిలో సానుకూలత పెరుగుతోందని భగవత్‌ అభిప్రాయపడ్డారు. కానీ దీన్ని కొన్ని స్వార్థ శక్తులు సహించలేకపోతున్నాయన్నారు. పటిష్ఠ భారతదేశ నిర్మాణం కోసం తీసుకున్న అనేక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చివరకు ఆర్.ఎస్.ఎస్ పై అభాండాలు వేయడానికి కూడా వెనుకడాటం లేదని ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని ప్రస్తావించారు భగవత్. ఎలాంటి ఆధారాలు లేకుండా  బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 


అటు మూకదాడులపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. మోడీ మన్ కీ బాత్.. మూకదాడుల విషయంలో మౌన్ కీ బాత్ గా మారిందని ఆరోపించారు. మూకదాడులపై బహిరంగ లేఖ రాసిన సెలెబ్రిటీలపై కేసులు పెట్టడాన్ని శశి థరూర్ ఖండించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. భావప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉంటామని దేశానికి హామీ ఇవ్వాలని ప్రధానిని కోరారు. మొత్తానికి మూక దాడులపై పెద్ద దుమారమే రేగుతోంది. ఏకంగా ప్రధాన మంత్రి సమాధానం చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి దీనిపై ప్రధాని మోడీ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. 






మరింత సమాచారం తెలుసుకోండి: