విశాఖ మేయర్ సీటు మీద వైసీపీ కన్ను ఉంది.  వైసీపీ పుట్టిన తరువాత ఇప్పటికి రెండు ఎన్నికలను ఎదుర్కొంది. అయితే రెండుసార్లు కూడా పార్టీకి విశాఖ చేదు అనుభవాన్నే మిగిల్చింది. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ ఎంపీగా పోటీ చేశారు. నాడు లక్ష ఓట్ల తేడాతో బీజేపీ ఎంపీ హరిబాబు ఇక్కడ నుంచి గెలిచారు. దాంతో జగన్ కి అది వ్యక్తిగతంగా నేటికీ తీరని అవమానంగా నిలిచింది. ఇక తాజా ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఉత్తరాంధ్రా మొత్తం వూపేసినా కూడా విశాఖలో మాత్రం ఆ జాడే లేదు.


 నాలుగు ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుని జెండా ఎగరేసింది. దాంతో జగన్ విశాఖ విషయంలో చాలా శ్రధ్ధ పెడుతున్నారని అంటున్నారు. ముచ్చటగా మూడవసారి జరిగే మేయర్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖను చేజార్చుకోరాదని జగన్ డిసైడ్ అయినట్లుగా పేర్కొంటున్నారు. అందుకొసం ఎలాంటి వ్యూహాల‌కైనా రెడీ అంటున్నారు. విశాఖ మేయర్ సీటును అంగబలం , అర్ధబలం ఉన్న వారికే ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అర్ధబలంతో పాటు సామాజికవర్గ సమీకరణలు సరిపోతే బయటనుంచి వచ్చిన నేతలను కూడా పార్టీలోకి రప్పించి మరీ మేయర్ కిరీటం తొడిగేస్తారని అంటున్నారు. గెలుపు ముఖ్యం తప్ప మరేమీ కాదన్న తీరుగా హైకమాండ్ ఆలోచనలు సాగుతున్నాయని చెబుతున్నారు.


 దీంతో మేయర్ సీటు కోసం రేసులో ఉన్న వారు ఇపుడు నిరాశలో కూరుకుపోయారు. విశాఖ అర్బన్ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి మేయర్ సీటు ఆశ పెట్టి తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఇపుడు ఆయన ఈ పరిణామాలు  చూసి తల్లడిల్లుతున్నారని టాక్. అలాగే విశాఖ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ సైతం మేయర్ సీటు మీద ఆశలు వదిలేసుకున్నట్లేనని అంటున్నారు.  వీరు కాకుండా మాజీ మంత్రి గారి పుత్రరత్నం, మరింతమంది కీలక  నేతలు కూడా కాబోయే మేయర్ ఎవరో తమకు కూడా తెలియదు అంటున్నారు.


మరి ఆ మేయర్ ఎవరు, ఎక్కడ నుంచి తెస్తారన్నది వైసీపీ రాజకీయమే చెప్పాలని అంటున్నారు. ఇక విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా దమ్మున్న నేతలకే కార్పోరేటర్ టికెట్లు దక్కుతాయన్న ప్రచారం పార్టీలో అసలైన నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైసీపీలో ఆది ఉంచి ఉన్న నేతల పట్ల హై కమాండ్ ఎందుకిలా వ్యవహరిస్తోందన్న ఆవేదన‌ అందరిలో ఉందిపుడు.  పదేళ్ళుగా పార్టీ జెండా పట్టుకున్న వారికి ఇప్పటికీ ఎటువంటి అధికార పదవులు లేవు. చివరి నిముషంలో చేరిన వారికి మాత్రం వెంటనే అందలాలు దక్కాయి. ఈ ఆక్రోశం ఇలా ఉండగానే పార్టీలో మరో రకమైన ప్రచారం కూడా సాగుతోంది. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: