భారత్ ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న కల నెరవేరింది. గగన తలంలో సత్తా చాటేందుకు సమయం ఆసన్నమైంది. దాదాపు నాలుగేళ్ల ఎదురు చూపుల తర్వాత రాఫెల్ యుద్ధ విమానం భారత్ చేతికి వచ్చింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ చేతుల మీదుగా ఈ రాఫెల్ విమానాన్ని అందుకున్నారు.


రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాఫెల్ విమానాన్ని అందుకోవడం భారత్ కు గొప్ప ఉత్సాహాన్నిస్తోంది. ఎందుకంటే.. రాఫెల్ యుద్ధ విమానం కోసం భారత్ ఎన్నాళ్లగానో ఎదురు చూస్తోంది. మొత్తం 36 రాఫెల్ విమానాలు కావాలని 2016లో భారత్ ఫ్రాన్స్ ను సంప్రదించింది. దివంగత నేత మనోహర్ పారికర్ రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం జరిగింది.


ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడతగా 4 రాఫెల్ విమానాలను భారత్ అందుకుంటోంది. ప్రస్తుతం భారత్ చేతికి ఒకటి రానుండగా మిగిలినవి 2020లో అవి భారత్ కు రానున్నాయి.ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.. డసోల్ట్ ఏవియేషన్ కర్మాగారంలో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించారు.


రాజ్ నాథ్ సింగ్.. రాఫెల్ విమానాన్ని అందుకున్న అనంతరం దానికి ఆయుధపూజ చేశారు. 'అనుకున్న సమయానికి రఫేల్ యుద్ధ విమానాలు ఇవ్వడం చాలా సంతోషం. మిగతా యుద్ధ విమానాలూ త్వరలోనే అందిస్తారని ఆశిస్తున్నాం. రఫేల్ జెట్లు భారత్ వైమానిక దళాన్ని బలోపేతం చేస్తాయి' అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.


అంతేకాదు.. రాజ్ నాథ్ సింగ్ ఈ రాఫెల్ యుద్ధ విమానంలో కాసేపు చక్కర్లు కొట్టారు కూడా. భారత్ చేతికి రాఫెల్ రాక పాక్ గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆక్రమిత కాశ్మీర్ ను కూడా సొంతం చేసుకుంటామంటూ భారత్ గర్జిస్తున్న వేళ.. ఈ రాఫెల్ రాక ఆ దేశానికి కంటి మీద కునుకులేకుండా చేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: