ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని భావించిన సీఎం జగన్ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానం వలన రాష్ట్రంలో పాత కాంట్రాక్టర్లకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని సమాచారం. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా కొత్తవారికి నిర్మాణ పనులు దక్కుతున్నాయి. 
 
ఇలాంటి సమయంలో పాత కాంట్రాక్టర్లకు ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకోవటం ఎలా అని బ్యాంకులు ఆందోళన పడుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, విద్యుత్ సంస్థలు, రోడ్డు నిర్మాణాలకు కాంట్రాక్టర్లు రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల నుండి భారీగా రుణాలను తీసుకున్నారని తెలుస్తోంది. 
 
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది కాంట్రాక్టర్లు రాష్ట్రంలోని బ్యాంకుల నుండి మాత్రమే కాకుండా విదేశీ బ్యాంకుల నుండి కూడా వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని సమాచారం. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ విధానంతో నిర్మాణ సంస్థలు మారిపోతూ ఉండటం, కాంట్రాక్టర్లు మారిపోతూ ఉండటంతో బ్యాంకులు గతంలో పాత కాంట్రాక్టర్లకు ఇచ్చిన రుణాల పరిస్థితి ఏమిటని సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. 
 
బ్యాంకులు పాత కాంట్రాక్టర్లకు ఇచ్చిన రుణాలకు గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చిందని అందువలనే రుణాలను ఇచ్చామని కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన హామీని గౌరవించటం లేదని చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఎం జగన్ ను కలిసిన సమయంలో ఇదే విషయం గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు లేఖ రాసిన సమయంలో ఇదే అంశం గురించి లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: