కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో ఈ సంవత్సరం కూడా రక్తం చిందింది. ఎనిమిది గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రల సమరంలో పాల్గొన్నారు. కర్రల సమరంలో 70 మందికి గాయాలు కాగా ఐదుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా దేవరగట్టులో కర్రల సమరం జరుగుతుంది. 
 
ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కొరకు మూడు గ్రామాల ప్రజలు ఒక వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరొక వర్గంగా విడిపోయారు. పోలీసులు, అధికారులు ఈ కర్రల సమరాన్ని అడ్డుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అధికారులు, పోలీసులు చెబుతున్న మాటలను స్థానికులు పట్టించుకోలేదు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా ఇక్కడి గ్రామాల ప్రజలు కర్రల సమరంలో పాల్గొన్నారు. 
 
కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ,ఎస్పీ ఫక్కీరప్ప పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. అధికారులు దాదాపు నెల రోజుల నుండే సంప్రదాయం పేరుతో కర్రల సమరం చేయవద్దని ప్రచారం నిర్వహించారు. అధికారులు దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్త్ చేపట్టారు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇక్కడ రక్తపాతం మాత్రం ఆగలేదు. 
 
కర్రల సమరంలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది మద్యం సేవించటంతో గాయాలపాలయ్యారని తెలుస్తోంది. కర్రల సమరాన్ని చూడటానికి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అధికారులు 100 మంది వైద్య సిబ్బందితో చర్యలు చేపట్టారు. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను కర్రలు నియంత్రించటం కోసం తీసుకున్నప్పటికీ వేలాది కర్రలతో భక్తులు ప్రత్యక్షమై కర్రల సమరంలో పాల్గొన్నారు.  ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో గాయపడినవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా దేవరగట్టులో కర్రల సమరం జరుగుతుంది. 



 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: