తన ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. డెబిట్ కార్డులు ఉన్న ఖాతాదారులకు ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుందని యాజమాన్యం ప్రకటించింది. డెబిట్ కార్డులు కలిగిఉన్న తమ ఖాతాదారులు ఏదైనా వస్తువును కొనుగోలు చేసినపుడు ఇఎంఐ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

 

ఏదైనా ఖరీదైన వస్తువును ఇపుడు కొనుగోలు చేసినపుడు కార్డుద్వారా డబ్బులు చెల్లించాలంటే ఖరీదు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సొస్తోంది. అంటే ఉదాహరణకు రూ. 10 వేల ఖరీదైన వస్తువును కొనుగోలు చేశారనుకోండి వెంటనే ఆ మొత్తాన్ని డెబిట్ కార్డు ద్వారా ఒకేసారి చెల్లించాల్సొచ్చేది.

 

అదే తాజాగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారమైతే  10 వేల రూపాయల వస్తువు ఖరీదును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన పద్దతిలో వాయిదాలపై చెల్లించవచ్చన్నమాట. వినియోగదారుని సౌకర్యం ప్రకారం 10 వేల రూపాయల వస్తువును ఓ నాలుగు వాయిదాలో లేకపోతే ఐదు వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది.

 

దేశవ్యాప్తంగా 40 వేల వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల దగ్గర ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్ (పివోఎస్)  దగ్గర తన ఖాతాదారులు ఈ వాయిదా రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని బ్యాంక్ ఓ ప్రకటనలో స్పష్టంగా చెప్పింది. వస్తువు ఖరీదును బట్టి కనిష్టంగా 6 నుండి గరిష్టంగా 18 నెలల వాయిదా సౌకర్యాలను ఖాతాదారులు ఉపయోగించుకోవచ్చని బ్యాంకు ఛైర్మ న్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు.

 

అయితే ఇక్కడే బ్యాంకు యాజమాన్యం ఓ మెలిక కూడా పెట్టింది. తమ ఖాతాదారుల్లో మెరుగైన క్రెడిట్ హిస్టరీ కలిగిన ఖాతాదారులు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందే వీలుందని చెప్పింది. అంటే రుణాలు తీసుకుని ఎగ్గొట్టటం, లేకపోతే తీసుకున్న రుణాల వాయిదాలను సకాలంలో చెల్లించకుండా డిఫాల్టర్ అయిన వాళ్ళకు ఇటువంటి సౌకర్యాలు అందే అవకాశాలు దాదాపు లేనట్లే అని చెప్పేసింది. కాబట్టి బ్యాంకు తాజాగా ప్రకటించిన ఈ సౌకర్యం ఎటువంటి ఖాతాదారులకు వర్తిస్తుందో ఎవరికి వారుగా అంచనా వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం తాజా సౌకర్యంపై  మీరూ ఓ లుక్కేయండి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: