వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అనుసరించే పార్టీ నాయకులందరూ నడుచుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన తిరుగులేని మెజారిటీ జగన్ కష్టమే అని తెలిసి నడుచుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే పని చేయాలని జగన్ గతంలోనే చెప్పారు. అయితే జగన్ ఇప్పుడు నెల్లూరు జిల్లా నాయకులతో తల బొప్పి కడుతోందట. ఆ జిల్లా నాయకుల తీరుతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా ఉన్నాయని జగన్ భావిస్తున్నారట. దీనిపై జగన్ దిద్దుబాటు చర్యలు తీసుకోబోతున్నారు.

 


ఇటివల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంకటాచలం ఎంపీడీవోను బెదిరించారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరినీ వదలపెట్టొద్దన్న సీఎం ఆదేశాలపై కోటంరెడ్డిని అరెస్టు చేయడం, అనంతరం బెయిల్ పై విడుదల కావడం జరిగాయి. అయితే ఈ పరిణామాలతో నెల్లూరు జిల్లా నాయకుల్లో ఐకమత్యం లేకపోవడం వారిలోని విబేధాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి – కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య విబేధాలు బయటకొచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇటువంటి జిల్లాలో నాయకుల విబేధాలు, నిత్యం వివాదాలు రావడం జగన్ కు, పార్టీకి ఆందోళనకరంగా మారాయి. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే పార్టీకి చెడ్డపేరు రావడంతో పాటు ప్రజల్లో నమ్మకం కోల్పోయే అవకాశాలున్నాయని గ్రహించిన జగన్ రంగంలోకి దిగారు.

 


ఈరోజు సాయంత్రం సీఎం క్యాంపు ఆఫీసులో నెల్లూరు జిల్లా నాయకుల అంశంపై చర్చించనున్నారు. ప్రధానంగా కోటంరెడ్డి – కాకాణి మధ్య వివాదంపై ఇద్దరి నేతలతో చర్చించనున్నారు. వారిద్దరి మధ్య ఉన్న విబేధాలు, పార్టీకి జరుగుతున్న నష్టంపై వివరించనున్నారు. పార్టీ విధానాలు, జిల్లా ప్రజల్లో నమ్మకం పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోటంరెడ్డి – కాకాణిలతో చర్చిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: